Allu Arjun | పుష్ప-2 రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ నేడు విచారణకు హాజరైన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు అల్లు అర్జున్ హాజరుకాగా.. దాదాపు రెండున్నర గంటల పాటు అతడిని పోలీసులు విచారించారు. విచారణ అనంతరం అల్లు అర్జున్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి బయలుదేరాడు. తన తండ్రి నిర్మాత అల్లు అరవింద్, బన్నీ కలిసి పీఎస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం ఒకే కారులో ఇంటికి బయలుదేరారు.
#WATCH | Actor Allu Arjun leaves from Chikkadpally police station in Hyderabad.
Allu Arjun appeared before Hyderabad police in connection with the Sandhya theatre incident. pic.twitter.com/SMgTCQWOQM
— ANI (@ANI) December 24, 2024
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన.. అనంతరం జరిగిన పరిణామాలపై పోలీసులు బన్నీని ప్రశ్నించారు. అడ్వొకేట్ అశోక్ రెడ్డి, ఏసీపీ రమేశ్, ఇన్స్పెక్టర్ రాజునాయక్ సమక్షంలో సెంట్రల్ జోన్ డీసీపీ అల్లు అర్జున్ను విచారించారు. విచారణ సందర్భంగా పుష్పరాజ్‌పై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం థియేటర్లో ఉన్నప్పుడు మీకు తెలియదా..? మీడియా ముందు ఎవరూ చెప్పలేదని ఎందుకు చెప్పారు..? రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా..? లేదా..? అనుమతి లేకుండా రోడ్ షో ఎలా నిర్వహించారు..? రోడ్ షోకు పోలీసులు అనుమతి ఇచ్చారని మీకు ఎవరు చెప్పారు..? వంటి ప్రశ్నలు అడిగినట్లు సమాచారం.
విచారణలో అల్లు అర్జున్ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. మొత్తం విచారణను వీడియో రికార్డింగ్ చేశారు. విచారణ సందర్భంగా పుష్పరాజ్ నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలిసింది. దాదాపు 20కిపైగా ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. కొన్ని ప్రశ్నలకు బన్ని సమాధానాలు ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయినట్లు సమాచారం.