ఇంద్రజ, అజయ్ జంటగా నటించిన చిత్రం ‘సీఎం పెళ్లాం’. రమణారెడ్డి దర్శకత్వంలో బీఆర్కే నిర్మించారు. ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు రమణారెడ్డి మాట్లాడుతూ ‘ఎలక్షన్లు రాగానే ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తి మాత్రమే కాకుండా ఆయన సతీమణి కూడా ఓట్లు అడగడం చూస్తుంటాం. కానీ గెలిచిన తర్వాత ఎంత మంది మళ్లీ వచ్చి ఓటర్లను కలుస్తున్నారు? అనే ప్రశ్నను ఈ సినిమా ద్వారా అడుగుతున్నాం. రాజకీయ నేపథ్యంలో సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించాం.
అలాగే పవర్లో ఉన్నవారు బూతులు మాట్లాడితే అధికారం నుంచి తొలగించాలనే చట్టం ఉండాలనే అంశాన్ని కూడా సినిమాలో చర్చించాం. వినోదప్రధానంగా సాగుతూనే చక్కటి సందేశం ఉంటుంది’ అన్నారు. గొప్ప సందేశంలో ఉన్న సినిమాలో నటించడం ఆనందంగా ఉందని అజయ్ తెలిపారు. ప్రజల్లో మార్పు రావాలని ఆశించి ఈ సినిమా తీశామని నిర్మాత రామకృష్ణ అన్నారు.