‘ఈ సినిమాలో యాక్షన్, రొమాన్స్ సమపాళ్లలో ఉంటాయి. ఓ వినూత్నమైన కథతో రూపొందించాం. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది’ అన్నారు అగ్ర హీరో విజయ్ సేతుపతి. ఆయన నటించిన తాజా చిత్రం ‘ఏస్’ నేడు ప్రేక్షకుల ముందుకొస్తున్నది. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో అరుముగ కుమార్ తెరకెక్కించారు. రుక్మిణి వసంత్ కథానాయిక. ఈ చిత్రాన్ని శ్రీపద్మిని సినిమాస్ పతాకంపై బి.శివప్రసాద్ తెలుగులో విడుదల చేస్తున్నారు.
గురువారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. గ్యాంబ్లింగ్ నేపథ్యం ఈ కథలో చిన్నభాగంగా మాత్రమే ఉంటుందని, క్రైమ్, కామెడీ, రొమాన్స్ అంశాలతో ఫుల్మీల్స్లాంటి సినిమా ఇదని దర్శకుడు అరుముగకుమార్ పేర్కొన్నారు. విజయ్ సేతుపతి అద్భుతమైన పెర్ఫార్మరని, అన్నీ కుదిరితే ఆయనతో ‘రొమాంటిక్ డాన్’ అనే చిత్రాన్ని త్వరలో ప్రకటిస్తానని నిర్మాత బి.శివప్రసాద్ తెలిపారు.