Abhishek sharma | టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇప్పుడు కేవలం క్రికెట్ మైదానంలోనే కాదు, తెలుగు ప్రేక్షకులలో కూడా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నాడు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతున్నప్పటి నుంచి తెలుగు సినిమా, సంస్కృతి మీద ప్రత్యేక ఆసక్తి పెంచుకున్న ఈ విధ్వంసకర బ్యాట్స్‌మన్ తాజాగా తన ఫేవరేట్ టాలీవుడ్ హీరోని వెల్లడించాడు. ఒక ఫన్ ఇంటర్వ్యూలో అభిషేక్ శర్మ మాట్లాడుతూ, తనకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే చాలా ఇష్టమని చెప్పాడు. ఖాళీ సమయాల్లో మహేష్ సినిమాలు చూస్తానని, హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఆయన క్రేజ్ గురించి తెలుగు సహచర ఆటగాళ్లతో చర్చిస్తుంటానని తెలిపాడు. క్రికెట్‌తో పాటు సినిమాలపై కూడా తనకు మంచి అవగాహన ఉందని ఈ మాటలతోనే అర్థమవుతోంది.
అంతేకాదు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా తనను బాగా ప్రభావితం చేసిందని అభిషేక్ వెల్లడించాడు. సినిమాలో అల్లు అర్జున్ చూపించిన మేనరిజమ్, స్క్రీన్ ప్రెజెన్స్ తనకు బాగా నచ్చాయని, కొన్నిసార్లు మైదానంలోనూ అవే హావభావాలు తన ఆటలో కనిపిస్తాయని నవ్వుతూ చెప్పాడు. అల్లు అర్జున్ డ్యాన్స్, ఎనర్జీ తనకు ఇష్టమని కూడా పేర్కొన్నాడు. తెలుగు సినిమాలపై అభిషేక్ ప్రేమ అక్కడితో ఆగలేదు. ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన తర్వాత సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా ‘నాటు నాటు’ పాట తనకు బాగా నచ్చిందని తెలిపాడు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటన అద్భుతమని కొనియాడాడు.
క్రికెట్ విషయానికి వస్తే, న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో అభిషేక్ శర్మ ఆట అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒక మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగితే, మరో మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అవుతూ అంచనాలకు అందని ఆటతీరును చూపిస్తున్నాడు. మూడో టీ20లో మాత్రం కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది మ్యాచ్‌ను ఒంటి చేత్తో ముగించాడు. అయితే నాలుగో టీ20లో మళ్లీ డకౌట్ కావడంతో భారత్‌కు పరాజయం తప్పలేదు. అయినా సరే, అభిషేక్ శర్మ ఇప్పుడు ప్రత్యర్థి బౌలర్లకు పెద్ద సవాల్‌గా మారాడు. అతన్ని ఔట్ చేయగలిగితేనే మ్యాచ్ గెలిచినట్టని ప్రత్యర్థి జట్లు భావించే స్థాయికి ఎదిగాడు. గతంలో విరాట్ కోహ్లీకి ఉన్న ఆ ‘స్టార్ ఇంపాక్ట్’ను ఇప్పుడు అభిషేక్ శర్మ నెమ్మదిగా అందుకుంటున్నాడనే అభిప్రాయం క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది.తెలుగు ప్లేయర్లు నితీష్ రెడ్డి, తిలక్ వర్మల సాయంతో తెలుగు డైలాగ్స్ కూడా నేర్చుకుంటున్నానని, హైదరాబాద్ బిర్యానీ తనకు చాలా ఇష్టమని అభిషేక్ చెప్పడం తెలుగు అభిమానులకు మరింత దగ్గర చేసింది.