Srileela | అచ్చ తెలుగందం శ్రీలీల బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ కార్తీక్ ఆర్యన్ సరసన ‘ఆషికీ-3’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా దీపావళికి విడుదల కానుంది. అయితే అరంగేట్రం చిత్రంతోనే ఈ భామ బాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల డేటింగ్లో ఉందంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నది. ఇటీవల కార్తీక్ ఆర్యన్ ఫ్యామిలీ పార్టీలో శ్రీలీల పాల్గొనడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. తాజాగా ‘ఐఫా’ వేడుకల్లో కార్తీక్ ఆర్యన్ తల్లి చేసిన వ్యాఖ్యలు డేటింగ్ వార్తలు నిజమనే భావన కలిగించేలా ఉన్నాయి.
‘ఐఫా’ వేడుకలో పాల్గొన్న ఆమెను నిర్మాత కరణ్‌జోహార్ ‘మీకు కాబోయే కోడలు ఎలా ఉండాలనుంటున్నారు’ అని ప్రశ్నించారు. ఓ మంచి డాక్టర్ మా ఇంటి కోడలిగా రావాలన్నది మా అందరి అభిమతం అంటూ కార్తీర్ ఆర్యన్ తల్లి సమాధానమిచ్చింది. శ్రీలీల మెడిసిన్ చదివిన విషయం తెలిసిందే. దీంతో ఆమెను ఉద్దేశించే కార్తీక్ ఆర్యన్ తల్లి ఆ వ్యాఖ్యలు చేసిందని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ఆ మాటల వెనక మర్మమేమిటో తెలియాలంటే తారలిద్దరిలో ఎవరో ఎవరో స్పందించాల్సిందేనని అభిమానులు అనుకుంటున్నారు.