తన తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’కు సంబంధించిన ఓ సర్ప్రైజింగ్ వార్తను వెల్లడించారు అమీర్‌ఖాన్. ఇందులో ఆయన తల్లి జీనత్ ఖాన్ ఓ అతిథి పాత్రలో మెరిసిందట. ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో అమీర్‌ఖాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ఇప్పటివరకు అమ్మ నా సినిమా సెట్లోకి రాలేదు. కానీ ఆశ్చర్యంగా ఓరోజు తను ఫోన్ చేసి ‘ఎక్కడ షూటింగ్ చేస్తున్నావు. నేను రావొచ్చా’ అని అడిగింది. వెంటనే కారు పంపించాను. చెల్లెలు నిఖత్‌తో కలిసి అమ్మ షూటింగ్ లొకేషన్‌కు వచ్చింది.
ఆ సమయంలో ఓ వెడ్డింగ్ సాంగ్ షూట్ చేస్తున్నాం. అంతలోనే దర్శకుడు ప్రసన్న వచ్చి ‘మీ అమ్మగారిని ఈ సీన్లో చూపిద్దామా? తన పర్మిషన్ అడగొచ్చా? అన్నాడు. ఇద్దరం వెళ్లి అమ్మను అడగ్గా తను ఆనందంగా ఓకే చెప్పింది. నేను ఒక్కసారిగా షాక్ తిన్నాను. పాటలోని రెండుమూడు సీన్స్‌లో అమ్మ కనిపిస్తుంది. నా సినిమాలో తొలిసారి అమ్మ భాగం కావడం నిజంగా గొప్ప అదృష్టం. ఇది అమ్మకు ఇచ్చిన ఓ బహుమతి’ అంటూ మురిసిపోయారు అమీర్‌ఖాన్. ఈ నెల 20న ‘సితారే జమీన్ పర్’ విడుదలకానుంది.