కెరీర్ ప్రారంభంలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని ఇటీవల ఓ ప్రైవేటు ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్‌ఖాన్. ‘ఖయామత్ సే ఖయామత్ తక్’ సినిమా విజయం సాధించిన రోజులవి. నా పేరు బాలీవుడ్లో బలంగా వినిపిస్తుండటంతో అందరి దృష్టీ నాపైనే ఉండేది. ఆ టైమ్‌లో అండర్ వరల్డ్ నుంచి నాకు ఆహ్వానం అందింది. దుబాయ్ వేదికగా జరుగనున్న పార్టీలో నేను హాజరు కావాలనేది ఆ ఆహ్వానం ఆంతర్యం. నేను దాన్ని పెద్ద పట్టించుకోలేదు. తర్వాత మా ఇంటికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వాళ్లు ఎవరు? వాళ్ల పేర్లేంటి? అనేది మాత్రం ఇప్పుడు చెప్పలేను.
నన్ను పార్టీకి తీసుకెళ్లేందుకు ఎంతో ప్రయత్నించారు. కారణం వాళ్లు అప్పటికే నేను ఆ పార్టీలో పాల్గొనబోతున్నట్లు ప్రకటించేశారట. అందుకే.. ఎంత డబ్బు కావాలన్నా ఇస్తామన్నారు. ఏం కావాలన్నా చేసిపెడతామన్నారు. నేను మాత్రం వాళ్లకు తలొగ్గలేదు. అక్కడికి రావడం నాకేమాత్రం ఇష్టంలేదని తెగేసి చెప్పా. ఇక వాళ్లు నన్ను సంప్రదించలేదు. నా జోలికి కూడా రాలేదు. ఆ క్షణంలో నా తల్లిదండ్రులు పడ్డ కంగారు ఇంకా నా కళ్లలో కనిపిస్తూనే ఉంది.’ అని చెప్పుకొచ్చారు అమీర్‌ఖాన్.