Sitare Zameen Par | అగ్ర హీరో అమీర్‌ఖాన్ అన్నంత పని చేశారు. ‘సితారే జమీన్ పర్’ చిత్రాన్ని తన సొంత యూట్యూబ్ ఛానల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అమీర్‌ఖాన్, జెనీలియా డిసౌజా కీలక పాత్రల్లో నటించిన ‘సితారే జమీన్ పర్’ చిత్రం గత నెల 20న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ హక్కులను ఏ ఓటీటీ సంస్థకు ఇవ్వనని, యూట్యూబ్‌లో పే పర్ వ్యూ విధానంలో తానే విడుదల చేస్తానని సినిమా రిలీజ్‌కు ముందు అమీర్‌ఖాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అమీర్‌ఖాన్ నిర్ణయం పలు ఓటీటీ సంస్థలను డిఫెన్స్‌లో పడేసింది. ఇదే విధానాన్ని అందరూ ఫాలో అయితే ఓటీటీ బిజినెస్ ప్రమాదంలో పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలో అమీర్‌ఖాన్ తన చిత్రాన్ని ఆగస్ట్ 1నుంచి యూట్యూబ్‌లో స్ట్రీమింగ్కు తీసుకొస్తున్నారు. ఇందుకోసం ఆయన ‘అమీర్‌ఖాన్ టాకీస్-జనతా కా థియేటర్’ పేరుతో సొంత యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించారు. పే పర్ వ్యూ విధానంలో 100 రూపాయలకు ఈ చిత్రాన్ని వీక్షించవొచ్చని ఆయన తెలిపారు. సినిమాల విషయంలో థియేట్రికల్ రిలీజ్‌కు తాను తొలి ప్రాధాన్యతనిస్తానని, థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాతే యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ తేవాలన్నది తన అభిమతమని, ఈ విధానం అటు నిర్మాతలకు, ఇటు ప్రేక్షకులకు లాభదాయకంగా ఉంటుందని అమీర్‌ఖాన్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు.