Aamir Khan | బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కెరీర్లో అతిపెద్ద ప్లాప్‌గా లాల్ సింగ్ చద్దా నిలిచిన విషయం తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా భారీ నష్టాలను మిగిల్చి, అమీర్‌ను తీవ్రంగా బాధించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాతో తాను ఎదుర్కొన్న అనుభవాలను అమీర్ బయటపెట్టారు. అమీర్ వెల్లడించిన దాని ప్రకారం.. “దంగల్” సినిమా ఇండియాలో 385 కోట్ల వసూళ్లు రాబట్టింది. లాల్ సింగ్ చద్దాకి కనీసం 100 కోట్లు వస్తుందని ఆశపడ్డారను. కానీ, సినిమా రిలీజ్ అయ్యాక ఫస్ట్ షోకే నెగటివ్ టాక్ రావడం, థియేటర్ల వద్ద ఖాళీ కుర్చీలు కనిపించడం ఆయనను షాక్‌కి గురిచేసిందట. చివరికి ఈ సినిమా వల్ల దాదాపు 200 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని అమీర్ తెలిపారు.
ఈ సినిమా ద్వారా నాగచైతన్య హిందీలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి ఆసక్తి ఉండటంతో చిరంజీవి వంటి ప్రముఖులకు ప్రీమియర్ షో వేయడంతో మూవీకి తెలుగులోను గట్టి ప్రచారమే జరిగింది. అయినప్పటికీ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అమీర్ నటనపైనా విమర్శలు వెల్లువెత్తాయి. కరోనా సమయంలో ఈ సినిమా షూటింగ్ జరగడం వల్లే చాలా ఖర్చులు పెరిగాయని అమీర్ తెలిపారు. విదేశాల్లో తీసిన కొన్ని కీలక ఎపిసోడ్లు చివరికి ఎడిటింగ్‌లో తీసేయాల్సి వచ్చాయట. టేబుల్ టెన్నిస్ నేపథ్యంలో ఉన్న ఓ సీన్‌కి కోట్లు ఖర్చుపెట్టారట. కానీ ఎడిటింగ్‌లో లేపేసారట. ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీరు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఓవర్సీస్ మార్కెట్లోనైనా ఈ సినిమా నడుస్తుందనుకున్నారు. జపాన్, చైనా వంటివాటిలో రిలీజ్ చేసి కొంత రికవరీ వస్తుందని ఆశించారు. కానీ అక్కడ కూడా సినిమాకి ఆదరణ లేకపోవడం మరింత నిరాశ కలిగించిందట. వైవిధ్యమైన సినిమాలతో మిస్టర్ పర్ఫెక్ట్గా పేరు తెచ్చుకున్న అమీర్ ఇప్పుడు కొంత వెనుకబడ్డట్లే కనిపిస్తున్నారు. ఓవైపు లాల్ సింగ్ చద్దా డిజాస్టర్, మరోవైపు తన కొడుకు సినిమాలు కూడా ఓటిటీలో దారుణంగా ఫెయిల్ అవ్వడం అమీర్‌ని కలిచి వేసిందని చెబుతున్నారు.అయితే ఈ మధ్య అమీర్ నటించిన సితారే జమీన్ పర్ మాత్రం మంచి విజయం సాధించింది. లేకుంటే పరిస్థితి వేరేలా ఉండేది.