వరుస పరాజయాలతో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్‌ఖాన్ కథాంశాల ఎంపికలో పునరాలోచనలో పడ్డారా? అంటే ఔననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ‘లాల్ సింగ్ చద్దా’ దారుణ పరాజయంతో తన తదుపరి సినిమాలపై అమీర్‌ఖాన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, కొంతకాలం పాటు ప్రయోగాత్మక చిత్రాలకు స్వస్తి పలికి యాక్షన్ కథాంశాల్ని ఎంచుకోవాలనే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. అమీర్‌ఖాన్ నటించిన గజిని, ధూమ్-3, సర్ఫరోష్, గులామ్ వంటి చిత్రాలు యాక్షన్ కంటెంట్‌తో మంచి విజయాల్ని సాధించాయి.
గత కొంతకాలంగా అమీర్‌ఖాన్ యాక్షన్ చిత్రాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ‘ధూమ్’ సిరీస్‌కు మరో భాగాన్ని తెరకెక్కించే వీలుందేమోనని అమీర్‌ఖాన్ యష్ రాజ్ ఫిల్మ్ సంస్థను సంప్రదించారని చెబుతున్నారు. ‘ధూమ్’ సిరీస్‌లో తాను పోషించిన సాహిర్, సమర్ పాత్రలకు కొనసాగింపు క్యారెక్టర్‌ను సృష్టించే విషయంలో ఆలోచించాలని ఆయన నిర్మాత, చిత్ర కథా రచయితల్లో ఒకరైన ఆదిత్యచోప్రాను కోరినట్లు తెలిసింది. దీంతో పాటు యాక్షన్ చిత్రాల దర్శకులతో అమీర్‌ఖాన్ వరుసగా సంప్రదింపులు జరుపుతున్నారని ..కాస్త విరామం తీసుకున్నా సరే మంచి యాక్షన్ఫిల్మ్తో హిట్‌కొట్టాలనే తపనతో అమీర్‌ఖాన్ ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.