Aamani | ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయికగా వెలుగొందిన నటి ఆమని ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. తన నటనతో ప్రతి పాత్రకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్న ఆమె, తాజాగా ‘హ్యాపీ జర్నీ’ అనే చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఆమని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘హ్యాపీ జర్నీ’ చిత్రంలో అన్నపూర్ణమ్మ, ఝాన్సీ, ఆమని, పాయల్ రాధాకృష్ణ, రవి శివతేజ, వంశీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విభిన్న వయసుల వ్యక్తులు కలిసి ప్యారిస్‌కు వెళ్లిన తర్వాత జరిగే ఆసక్తికర సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది.
ప్రత్యేకంగా ఈ చిత్రం కోసం యూనిట్ మొత్తం ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోనే సుదీర్ఘ షెడ్యూల్ నిర్వహించింది. దాదాపు 22 రోజుల పాటు నటీనటులు, సాంకేతిక బృందం అక్కడే ఉండి షూటింగ్ పూర్తి చేశారు.అయితే తాజాగా జరిగిన టీజర్ లాంచ్ కార్యక్రమంలో మాట్లాడిన ఆమని, చిత్ర యూనిట్‌పై ప్రశంసలు కురిపించారు. చాలా కాలం తర్వాత ఇంత సౌకర్యవంతమైన, ఆత్మీయత కలిగిన ప్రొడక్షన్ హౌస్‌తో పనిచేశానని తెలిపారు. ఈ మధ్యకాలంలో ఇంత మంచి ప్రొడక్షన్ హౌస్‌ను నేను చూడలేదు. అందరినీ ఎంతో బాగా చూసుకున్నారు. షూటింగ్ సమయంలో ఎక్కడా ఇబ్బంది అనిపించలేదు అని ఆమని పేర్కొన్నారు. తాను సాధారణంగా డైట్ పాటిస్తానని, కానీ ప్యారిస్‌లో మాత్రం ఆ నియమాలన్నింటినీ పక్కన పెట్టానని ఆమని నవ్వుతూ చెప్పారు.
నేను సాధారణంగా చాలా స్ట్రిక్ట్‌గా డైట్ ఫాలో అవుతాను. కానీ అక్కడ మాత్రం డైట్ గురించి అస్సలు ఆలోచించలేదు. అందరూ కలిసి ఎంతో ఆనందంగా భోజనం చేసేవాళ్లం. నేనూ బాగా తిన్నాను అని ఆమె తెలిపారు. షూటింగ్ సమయంలో యూనిట్ అందించిన సౌకర్యాల గురించి మాట్లాడుతూ, ప్రతి రోజూ ప్రత్యేకంగా డిన్నర్ ఏర్పాట్లు చేసేవారని ఆమని వెల్లడించారు. డిన్నర్ సమయంలో ఒక పెద్ద ట్యాంక్ ఏర్పాటు చేసేవారు. అందులో వైన్ ఉండేది. ఎవరికిష్టమైతే వారు వెళ్లి తీసుకునేవారు. నాన్‌వెజ్‌లో చికెన్, మటన్, ప్రాన్స్, ర్యాబిట్ వంటి అనేక రకాల వంటకాలు ఉండేవి. నేను మాత్రం వెజిటేరియన్ కావడంతో అవేమీ తినలేదు అని ఆమె తెలిపారు. ఆమని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ప్యారిస్‌లో గడిపిన అనుభవాలు, షూటింగ్ సమయంలో యూనిట్ కల్పించిన సౌకర్యాల గురించి ఆమె చెప్పిన విషయాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.