‘బంధుమిత్రుల అభినందనలతో’ అనే టైటిల్ కొద్ది రోజులుగా బాగా పాపులర్ అయింది. అందుక్కారణం వెంకటేష్-త్రివిక్రమ్ సినిమాకు అదే టైటిల్ పెట్టబోతున్నారని విస్తృతంగా ప్రచారం జరగడమే. అయితే ఇటీవలే ఆ చిత్రానికి ‘ఆదర్శ కుటుంబం’ అనే టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పటికే ‘బంధుమిత్రుల అభినందనలతో’ అనే టైటిల్ ప్రేక్షకులకు బాగా రీచ్ అయింది. టైటిల్లో పాజిటివ్ వైబ్స్ ఉన్నాయని చాలా మంది అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో అదే టైటిల్‌తో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట. ఇందులో ‘మ్యాడ్’ ఫేమ్ నార్నే నితిన్ హీరోగా నటిస్తారని తెలిసింది. నిర్మాత నాగవంశీ టైటిల్‌ను రిజిస్టర్ చేయించారని, ఈ చిత్రానికి ‘బలగం’ రైటర్స్‌లో ఒకరైన నాగరాజు దర్శకత్వం వహిస్తారని సమాచారం. అయితే ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.