హైదరాబాద్: తాను ముస్లిం కావడం వల్లే బాలీవుడ్లో అవకాశాలు తగ్గాయని, మారిన అధికార సమీకరణాలు కూడా అందుకు ఓ కారణం కావొచ్చు అని ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలను బాలీవుడ్ ప్రముఖులతో సహా అందరూ ఖండిస్తున్నారు. తాజాగా సంచలన రచయిత తస్లీమా నస్రీన్(Taslima Nasreen) కూడా స్పందించారు. ఆమె తన ఎక్స్ అకౌంట్లో ఓ పోస్టు చేశారు.
ఏఆర్ రెహ్మాన్ మనోవేదనను ఆమె తప్పుపట్టారు. రెహ్మాన్ ముస్లిం వ్యక్తే అని, భారత్‌లో ఆయన ఓ ఫేమస్ వ్యక్తి అని, ఇతర ఆర్టిస్టులకన్నా ఆయన సంపాదన ఎక్కువే అని, బహుశా సంపన్న సంగీత దర్శకుడు అయి ఉంటారని, కానీ ముస్లిం కావడం వల్లే బాలీవుడ్లో అవకాశాలు రావడం లేదని రెహ్మాన్ ఫిర్యాదు చేస్తున్నారని ఆమె చెప్పారు. బాలీవుడ్లో షారూక్ బాద్షా అని, సల్మాన్, ఆమిర్, జావిద్ అక్తర్, షబానా అజ్మీ అందరూ సూపర్ స్టార్లే అని ఆమె తెలిపారు.
సంపన్నులు, ఫేమస్ వ్యక్తులకు ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉండవని, ప్రాంతం ఏదైనా, కులం ఏదైనా, వర్గం ఏదైనా సమస్య ఉండదని తస్లీమా అన్నారు. కానీ నాలాంటి పేదలకు సమస్యలు ఉంటాయన్నారు.తాను హేతువాదినని, ఎక్కడకు వెళ్లినా సమస్యలు ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఇలాంటి సమస్యలు బాలీవుడ్లో ముస్లిం స్టార్లకు రావన్నారు. ఇస్లాంను వ్యతిరేకించినందుకు తాను బహిష్కృత జీవితాన్ని గడుపుతున్నట్లు ఆమె తెలిపారు. కానీ ఏఆర్ రెహ్మాన్‌ను హిందువులు, ముస్లింలు, బౌద్దులు, క్రైస్తవులు, హేతువాదులు విశ్వసిస్తారని, ఆయన మీద జాలిపడే సందర్భం కాదు అన్నట్లు తస్లీమా నస్రీన్ అన్నారు.
A. R. Rahman is a Muslim and is extraordinarily famous in India. His remuneration, as far as I have heard, is higher than that of all other artists. He is probably the richest musician. He is complaining that he is not given work in Bollywood because he is a Muslim. Shah Rukh…
— taslima nasreen (@taslimanasreen) January 18, 2026