తాను ముస్లిం కావడం వల్లే బాలీవుడ్లో అవకాశాలు తగ్గాయని, మారిన అధికార సమీకరణాలు కూడా అందుకు ఓ కారణమని, సృజనాత్మకతతో ఏమాత్రం సంబంధం లేని కొందరు వ్యక్తులు మ్యూజిక్ ఇండస్ట్రీని శాసిస్తున్నారనీ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహ్మాన్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్లో తీవ్ర దుమారాన్ని రేకెత్తించాయి. ఈ వ్యాఖ్యలను పలువురు బాలీవుడ్ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. దాంతో రెహ్మాన్‌కి ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వక తప్పలేదు.
తన వ్యాఖ్యాలపై వివరణ ఇస్తూ ఆదివారం ఓ వీడియో విడుదల చేశారాయన. కొన్ని సందర్భాల్లో ఒకరి ఉద్దేశాలు మరొకరికి తప్పుగా అర్థమయ్యే అవకాశం ఉందని, మాటలతో ఇతరులను బాధపట్టే తత్వం తనది కాదని వీడియోలో పేర్కొన్నారు రెహ్మాన్. ‘దేశ సంస్కృతిని అనుసంధానించే, గౌరవించే గొప్ప మార్గం సంగీతం. స్వరాలతో శ్రోతల్ని ఉత్తేజపరచడాన్ని సేవగా భావిస్తా.
నా దేశం నాకు స్ఫూర్తి. నా దేశం నాకు గురువు. నా దేశం నా ఇల్లు. భారతీయునిగా పుట్టడం నా అదృష్టం. నా భావాలను స్వేచ్ఛగా ప్రకటించే అవకాశం నా దేశం నాకిచ్చింది. నా నిజాయితీని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా.’ అంటూ ఆశాభావం వెలిబుచ్చారు రెహ్మాన్. దేశంలో తొలి మల్టీకల్చరల్ వర్చువల్ బ్యాండ్‌ను సృష్టించడం నుంచి.. హాన్స్జిమ్మర్తో కలిసి ‘రామాయణ’ సినిమాకు సంగీతం అందించడం వరకూ ప్రతి ప్రయాణం నా లక్ష్యాలను బలపరిచిందని రెహ్మాన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.