‘రాయలసీమ నగిరిలోని వ్యవసాయ అధారిత నిరుపేద కుటుంబం నుంచి వచ్చాన్నేను. బెంగళూరులో కొన్నాళ్లు ఉద్యోగం చేశా. 2017లో హైదరాబాద్ వచ్చాను. అప్పట్నుంచీ సినిమా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. షార్ట్ఫిల్మ్ డైరెక్ట్ చేసి నటించాను. బీ స్టూడియో వారు నా దగ్గర రూపాయి తీసుకోకుండా యాక్టింగ్ శిక్షణ ఇచ్చారు. పలు స్టేజ్ షోలు కూడా చేశా. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ అసోసియేట్ డైరెక్టర్స్ నా స్టేజ్ షో చూసి, ఆడిషన్స్ తీసుకున్నారు. అలా ‘తిమ్మరాజుపల్లి’ ఛాన్స్ దక్కింది’ అని చెప్పారు నటుడు లతీష్. హీరో కిరణ్ అబ్బవరం నిర్మించిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’ చిత్రం ద్వారా పరిచయమైన 50మందిలో లతీష్ ఒకరు. అందులో ఆయన సిద్ధయ్యగా విలన్ పాత్ర పోషించారు. ఆ పాత్ర తనకు గుర్తింపునిచ్చిందని లతీష్ ఆనందం వెలిబుచ్చారు.
‘ ‘తిమ్మరాజుపల్లి టీవీ’లో హీరో పాత్రకు సమానంగా విలన్ పాత్ర ఉంటుంది. అందుకే ఆ పాత్ర కోసం 30 కేజీలు బరువు పెరిగాను. సినిమా చూసిన వారంతా ‘నువ్వేనా’ అంటుంటే సంతోషంగా, సంతృప్తిగా ఉంది. సినిమా చూసి కిరణ్ అబ్బవరంతోపాటు యూనిట్ సభ్యులంతా మెచ్చుకున్నారు’ అని లతీష్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కథలు వింటున్నానని, భవిష్యత్లో చేసే సినిమాల గురించి త్వరలో చెబుతానని లతీష్ పేర్కొన్నారు.