Movies | జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. వారి హాహాకారాలు ఇంకా చెవుల్లో మార్మోగుతుండగానే, పాక్ ప్రేరేపిత ఉగ్ర మూకలపై భారత సాయుధ బలగాలు ఉక్కు పిడికిలి బిగించి దాడులకి దిగాయి. ‘ఆపరేషన్ సింధూర్’తో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లలోని కీలక ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు జరిపి, ఉగ్రవాద లోకంకి వణుకు పుట్టించింది. అయితే మే 6 రాత్రి భారత సైన్యం పాకిస్తాన్‌పై వైమానిక దాడి చేసిన నేపథ్యంలో ఎయిర్ స్ట్రైక్ సినిమాలపై ఓ లుక్కు వేద్దాం. ముందుగా ఉరి : ది సర్జికల్ స్ట్రైక్ (2019) చిత్రం జీ5లో స్ట్రీమ్ అవుతుండగా, ఇది 2016లో ఉరి దాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం పాకిస్తాన్‌పై చేసిన సర్జికల్ స్ట్రైక్ ఆధారంగా రూపొందింది.
ఇక అవరోధ్: ది సీజ్ వితిన్ సోని లివ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇందులో ఉరి సర్జికల్ స్ట్రైక్, బాలాకోట్ వైమానిక దాడి వంటి సంఘటనలు చూపించారు. రక్షక్: ఇండియాస్ బ్రేవ్ వెబ్ సిరీస్ 2023లో విడుదల కాగా, ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఈ వెబ్ సిరీస్ పుల్వామా ఉగ్రవాద దాడి తర్వాత భారత సైన్యం చర్యల కథను చూపిస్తుంది. రణనీతి : బాలాకోట్ అండ్ బియాండ్ వెబ్ సిరీస్ 2024లో విడుదలైంది. ఇప్పుడు జియో హాట్ స్టార్‌లో అందుబాటులో ఉంది. ఈ వెబ్ సిరీస్ కథ బాలాకోట్ వైమానిక దాడి నేపథ్యంలో రూపొందింది. 2024లో వచ్చిన ఫైటర్ చిత్రం ఇప్పుడు నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇది 2019లో పుల్వామా ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం చేసిన బాలాకోట్ వైమానిక దాడి కథ నేపథ్యంలో రూపొందింది.
2024లో వచ్చిన ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం పుల్వామా ఉగ్రదాడి, ఆ తర్వాత భారత వైమానిక దళం చేసిన బాలాకోట్ వైమానిక దాడి నేపథ్యంలో రూపొందింది..వరుణ్ తేజ్, మానుషి చిల్లర్, నవదీప్, పరేష్ పహుజా వంటి నటులు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఇక 2025లో వచ్చిన స్కై ఫోర్స్ 1965లో భారత వైమానిక దళం పాకిస్తాన్‌పై చేసిన తొలి వైమానిక దాడి ఆధారంగా రూపొందింది. అక్షయ్ కుమార్, వీర్ పహాడియా నటించిన ఈ చిత్రానికి అభిషేక్ అనిల్ కపూర్, సందీప్ కేవలానీ దర్శకత్వం వహించారు. ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమ్ అవుతుంది.