అగ్ర నటుడు చిరంజీవి ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. 1978 సెప్టెంబర్ 22న విడుదలైన ఈ చిత్రం సోమవారం నాటికి 47ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తన సినీ జీవితానికి నాంది పలికిన ఈ చిత్రాన్ని గుర్తుచేసుకుంటూ, అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ చిరంజీవి ఓ పోస్ట్ పెట్టారు. ‘కొణిదెల శివశంకర వరప్రసాద్ అనే నేను ‘ప్రాణం ఖరీదు’ చిత్రం ద్వారా ‘చిరంజీవి’గా మీకు పరిచయమై నేటితో 47ఏళ్లు పూర్తయ్యాయి ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి, మీ అన్నయ్యగా, కొడుకుగా, కుటుంబ సభ్యుడిగా, ఒక మెగాస్టార్‌గా ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను.
నేను 155 చిత్రాలు పూర్తి చేసుకున్నానంటే..అందుక్కారణం మీరందించిన నిస్వార్థమైన ప్రేమ. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నేను పొందిన ఎన్నో అవార్డులు, గౌరవ మర్యాదలకు కారణం మీరే. మీ అందరి ప్రేమానురాగాలు ఎల్లప్పుడూ కొనసాగాలని కోరుకుంటున్నా’ అని చిరంజీవి తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ‘విశ్వంభర’ ‘మన శివశంకర వరప్రసాద్’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.