స్నేహం గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ, మన విద్యా వ్యవస్థలోని లోపాలను చర్చిస్తూ సందేశాత్మకంగా రూపొందిన ‘త్రీ ఇడియట్స్’ చిత్రం తిరుగులేని ఆదరణ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అమీర్‌ఖాన్, ఆర్.మాధవన్, శర్మాన్ జోషి, కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో రాజ్‌కుమార్ హీరానీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2009లో విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి ‘4 ఇడియట్స్’ అనే టైటిల్‌ను ఖరారు చేయబోతున్నారని సమాచారం.
అమీర్‌ఖాన్, ఆర్.మాధవన్, శర్మాన్‌జోషి సీక్వెల్లో కొనసాగుతారని, ఈ త్రయానికి మరో అగ్ర హీరో జత కలుస్తారని బాలీవుడ్ టాక్. ప్రస్తుతం ఆ నాలుగో ‘ఇడియట్’ అన్వేషణలో చిత్రబృందం ఉందని తెలిసింది. ఈ ఫ్రాంఛైజీని లార్జర్ స్కేల్లో రూపొందించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. తొలిభాగంలో విద్యా వ్యవస్థ గురించి చర్చించగా, ఈ సీక్వెల్లో మరో సామాజికాంశాన్ని ప్రధాన కథా వస్తువుగా తీసుకోబోతున్నారని సమాచారం. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ సీక్వెల్ సెట్స్‌పైకి వెళ్లనుందని వార్తలొస్తున్నాయి.