ఇప్పటివరకూ తెలుగులో రానటువంటి వినూత్నమైన కాన్సెప్ట్‌తో ‘28 డిగ్రీస్ సెల్సియస్’ చిత్రాన్ని తెరకెక్కించానని చెప్పారు దర్శకుడు డా॥ అనిల్ విశ్వనాథ్. ‘పొలిమేర’ చిత్రంతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారాయన. ఐదేళ్ల క్రితమే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఆయన తొలిచిత్రం ‘28 డిగ్రీస్ సెల్సియస్’ ఏప్రిల్ 4న ప్రేక్షకుల ముందుకురానుంది. నవీన్‌చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా నటించారు. ఈ సందర్భంగా శనివారం డా॥ అనిల్ విశ్వనాథ్ పాత్రికేయులతో ముచ్చటించారు. 2020 మే నెలలో సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేశామని, అయితే లాక్డౌన్ కారణంగా వాయిదా వేశామన్నారు. ఇద్దరు మెడికల్ స్టూడెంట్స్ మధ్య నడిచే ప్రేమకథ ఇదని, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు సూపర్ నేచురల్ అంశాలుంటాయని వివరించారు.
‘బ్రెయిన్ డ్యామెజీ అయిన వారు ఎక్కువ వేడి, చల్లదనాన్ని తట్టుకోలేరు. మెడికల్ థియరీలో ఉన్న ఈ పాయింట్‌ను సినిమాలో తీసుకున్నాం. 28 డిగ్రీస్ సెల్సియస్ టెంపరేచర్‌ను మాత్రమే తట్టుకునే కథానాయిక పాత్ర చుట్టూ ఈ కథ నడుస్తుంది’ అన్నారు. నిర్మాత వంశీ నందిపాటికి ఈ సినిమా నచ్చి రిలీజ్ చేయడానికి ముందుకొచ్చారని తెలిపారు. తన దర్శకత్వంలో ‘పొలిమేర 3’ త్వరలో సెట్స్‌మీదకు వెళ్తుందని, ఇది పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని, వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తామని, బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో త్వరలో ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ చేయబోతున్నానని డా॥ అనిల్ విశ్వనాథ్ పేర్కొన్నారు.