ఆదివారం 24 మే 2020
Cinema - Mar 26, 2020 , 23:14:56

కరోనాపై విత‘రణం’

కరోనాపై విత‘రణం’

ప్రపంచ మానవాళికి పెనువిపత్తుగా పరిణమించిన కరోనా మహమ్మారిపై పోరాటంలో తమవంతు పాత్ర పోషించేందుకు సినీప్రముఖులు ముందుకొస్తున్నారు.  కనిపించని శత్రువుపై పోరాటంలో ప్రజలంతా కార్యోన్ముఖులు కావాలని ఉద్భోధిస్తున్నారు. కరోనా కట్టడిలో ప్రభుత్వాలకు చేయూతగా భారీ విరాళాల్ని ప్రకటిస్తూ తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు.  కరోనాపై యుద్ధంలో గెలుపుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని  పిలుపునిస్తున్నారు.

పవన్‌కల్యాణ్‌ 2 కోట్ల్లు

కరోనాపై పోరుకు మద్దతుగా అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్‌ రెండు కోట్ల విరాళాన్ని ప్రకటించారు. ఇందులో ప్రధాన మంత్రి సహాయనిధికి కోటి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంతి సహాయనిధికి 50లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి 50లక్షల చొప్పున  విరాళాన్ని అందించబోతున్నట్లు తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రధానమంత్రి స్ఫూర్తిదాయ నాయకత్వం దేశాన్ని ఈ ఉపద్రవం నుంచి గట్టెక్కిస్తుందనే విశ్వాసముందని పవన్‌కల్యాణ్‌  పేర్కొన్నారు.

సినీ కార్మికులకు చిరంజీవి కోటి వితరణ

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో సినీ చిత్రీకరణలన్నీ నిలిచిపోయాయి. దీంతో సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకోవడానికి పలువురు తారలు ముందుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగు సినీ కార్మికుల సహాయార్థం మెగాస్టార్‌ చిరంజీవి కోటి రూపాయల విరాళాన్ని అందజేయనున్నారు. లాక్‌డౌన్‌ దినసరి కూలీలు, అల్పాదాయ వర్గాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని,  మానవతా దృక్పథంతో కార్మికుల సంక్షేమ నిధికి కోటి రూపాయల్ని విరాళంగా ఇస్తున్నట్లు చిరంజీవి తెలిపారు.ప్రభాస్‌ కోటి రూపాయలు

జార్జియాలో జరిగిన తన తాజా సినిమా షూటింగ్‌ నుంచి ఈ మధ్యే హైదరాబాద్‌కు తిరిగొచ్చారు ప్రభాస్‌. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ప్రస్తుతం ఆయన స్వీయగృహ నిర్బంధంలో ఉన్నారు. కరోనా కట్టడిలో ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు చేయూతగా ప్రభాస్‌ కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ప్రతి ఒక్కరు ఇంటివద్దనే ఉంటూ కరోనాపై పోరాటంలో విజయం సాధించాలని పిలుపునిచ్చారు.ఎన్టీఆర్‌ 75లక్షలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రుల సహాయనిధికి జూనియర్‌ ఎన్టీఆర్‌ 25లక్షల చొప్పున విరాళాన్ని ప్రకటించారు. మరో 25లక్షల్ని సినీ కార్మికుల్ని ఆదుకోవడానికి అందిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.దిల్‌రాజు 20లక్షలు

కరోనా నివారణ చర్యల కోసం రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు పదిలక్షల చొప్పున మొత్తం 20లక్షల్ని విరాళాన్ని ఇవ్వనున్నట్లు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తెలిపారు. ‘కరోనా కారణంగా అంతర్జాతీయ విపత్తు ఏర్పడింది. దీనిని నివారించడం మనందరి బాధ్యత. ఈ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు ప్రశంసనీయం’ అని దిల్‌రాజు చెప్పారు.రామ్‌చరణ్‌ 70లక్షలు

గురువారం తన ట్విట్టర్‌ ఖాతాను ఆరంభించారు రామ్‌చరణ్‌. బాబాయ్‌ పవన్‌కల్యాణ్‌ ఇచ్చిన స్ఫూర్తితో కరోనా నివారణ కోసం కేంద్ర ప్రభుత్వంతో పాటు ఉభయ తెలుగు రాష్ర్టాలకు 70లక్షలు విరాళాల్ని ప్రకటించారు రామ్‌చరణ్‌. ‘ఈ విపత్తును అరికట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్మోహన్‌రెడ్డి అద్భుతమైన చర్యలు తీసుకుంటున్నారు. వారికి మనమంతా అండగా నిలుద్దాం’ అని రామ్‌చరణ్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. యువహీరో సాయితేజ్‌ సైతం ఉభయ తెలుగురాష్ర్టాల సీఎం సహాయనిధికి 10లక్షల విరాళాన్ని ప్రకటించారు.మహేష్‌బాబు కోటి విరాళం

కరోనా కల్లోలం నుంచి ప్రజల్ని రక్షించడానికి ప్రభుత్వాలు అద్భుతంగా కృషి చేస్తున్నాయని అగ్ర కథానాయకుడు మహేష్‌బాబు కొనియాడారు. ఈ మహమ్మారిని తరిమికొట్టడానికి తన వంతు సహాయంగా కోటి రూపాయల విరాళాన్ని అందజేయబోతున్నట్లు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రుల సహాయనిధికి 50లక్షల చొప్పున విరాళాన్ని ప్రకటించారాయన. ‘భారత జాతి మొత్తం కరోనాపై పోరులో ఐక్యంగా నిలబడాలి. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ  సూచనల్ని పాటిస్తూ కరోనా నిర్మూలన యుద్ధంలో విజయం సాధించాలి’ అని మహేష్‌బాబు అన్నారు.

కార్మికులకు 5లక్షలు

అల్లరి నరేష్‌ ప్రస్తుతం ‘నాంది’ పేరుతో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నారు. 21రోజుల లాక్‌డౌన్‌ వల్ల షూటింగ్‌లన్నీ నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో తన సినిమా కోసం పనిచేస్తున్న దినసరి వేతన కార్మికులు ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారని తెలుసుకున్న ఆయన 50 మంది కార్మికులకు ఒక్కొక్కరికి 10వేల చొప్పున సాయం అందించాలని నిర్ణయించుకున్నారు. చిత్ర నిర్మాత సతీష్‌ వేగేశ్నతోకలిసి తాను ఈ సహాయాన్ని అందిస్తున్నానని,  సాటి మనిషికి ఆదుకోవడమే మన కర్తవ్యమని అల్లరి నరేష్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

కొరటాల శివ 5లక్షలు

ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కరోనా నియంత్రణ సహాయార్థం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రుల సహాయ నిధికి ఐదు లక్షల చొప్పున  విరాళాన్ని ప్రకటించారు. కరోనాపై పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు.

అనిల్‌ రావిపూడి10లక్షలు

కరోనాపై పోరాటానికి తన వంతు మొత్తంగా పదిలక్షల విరాళాన్ని ప్రకటించారు యువ దర్శకుడు అనిల్‌ రావిపూడి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో 5లక్షలు అందజేయనున్నట్లు ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ప్రజలందరూ సామాజిక దూరం పాటిస్తూ కరోనాపై విజయం సాధించాలని ఆయన కోరారు.

త్రివిక్రమ్‌ 20లక్షలు

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ కరోనాపై పోరాటానికి మద్దతుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల ముఖ్యమంత్రుల సహాయనిధికి  10లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. ఈ విరాళాన్ని త్వరలో ప్రభుత్వానికి అందజేస్తానని ఓ ప్రకటనలో తెలిపారు.


logo