నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘18పేజీస్’. ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథనందించిన ఈ చిత్రానికి ఆయన శిష్యుడు సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. ఈ నెల 23న విడుదలకానుంది. ఈ సినిమాలో గోపీసుందర్ స్వరపరచగా సిధ్‌శ్రీరామ్ ఆలపించిన ‘ఏడురంగుల వాన..రెండు కళ్లలోన’ అనే గీతాన్ని అల్లు అరవింద్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ ‘పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలతో సాగే మ్యూజికల్ లవ్‌స్టోరీ ఇది’ అన్నారు. ‘నా గురువు సుకుమార్‌గారు చక్కటి ఫీల్ ఉండే మ్యూజికల్ లవ్‌స్టోరీ చేద్దామన్నారు. అనుకున్న విధంగానే హార్ట్‌టచింగ్ స్టోరీని అందించారు’ అని దర్శకుడు పేర్కొన్నారు. నిఖిల్ మాట్లాడుతూ ‘ఇందులో నేను సిద్ధు అనే యువకుడి పాత్రలో కనిపిస్తా. ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీల్‌ను అందించే చిత్రమిది’ అని చెప్పారు. ‘కార్తికేయ-2’ తర్వాత నిఖిల్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని కథానాయిక అనుపమ పరమేశ్వరన్ పేర్కొంది.