Supreme Court | బాలీవుడ్ దర్శకుడు విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన ‘12th ఫెయిల్’ స్ఫూర్తిదాయక కథాంశంతో విమర్శకుల ప్రశంసలు పొందింది. విక్రాంత్ మస్సే, మేధా శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఐపీఎస్ మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఇంటర్ ఫెయిలైనా నిరుత్సాహపడకుండా ఐపీఎస్ సాధించిన మనోజ్‌కుమార్ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. తాజాగా ఈ చిత్రం అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కోసం సుప్రీంకోర్టులో ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు.
ఇందులో న్యాయవాదులు, వారి కటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. ఇలాంటి సినిమాలు ప్రజల్లో స్ఫూర్తినింపుతాయని సీజేఐ చిత్ర బృందాన్ని ప్రశంసించారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు చూస్తున్నప్పుడు కన్నీళ్లొచ్చాయని ఆయన అన్నారు. నటీనటులందరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారని, మనిషి ఎల్లప్పుడు ఆశతో జీవించాలని, అప్పుడే జీవిత లక్ష్యాన్ని చేరుకోవచ్చనే సందేశంతో సినిమా తీశారని సీజేఐ చిత్ర బృందాన్ని అభినందించారు. తన జీవితంలో ఇవి మధుర క్షణాలని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కలిసి సినిమా చూడటం సంతోషంగా ఉందని, ఐదేళ్ల పాటు శ్రమించి ఈ సినిమా చేశానని దర్శకుడు విధు వినోద్ చోప్రా తెలిపారు.