గత ఏడాది సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’తో సందడి చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి.. మొన్న సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’తో రీజనల్ రికార్డులన్నింటినీ తుడిపెట్టేశారు. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వచ్చే ఏడాది సంక్రాంతిని కూడా ఈ యంగ్ ఎనర్జిటిక్ డైరెక్టర్ టార్గెట్ చేసినట్టు ఫిల్మ్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నది. మరి వచ్చే ఏడాది సంక్రాంతికి అనిల్ ఏ హీరోతో వస్తారు? అనే వివరాల్లోకెళ్తే.. ‘విశ్వంభర’ ప్రమోషన్స్ పూర్తి చేసి, శ్రీకాంత్ ఓదెల సెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సమాయత్తం అవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆ తర్వాత లైన్లో బాబీ ఎలాగూ ఉన్నాడు. వెంకటేష్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన ‘ఆదర్శకుటుంబం’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా మే చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక వెంకీతో అనిల్ జూన్‌లో షూటింగ్ ప్రారంభించినా సంక్రాంతికి రావడం కష్టం. ప్రభాస్, తారక్, బన్నీ, చరణ్, నానీ వీళ్లంతా ఆల్రెడీ వారివారి ప్రాజెక్టులతో బిజీబిజీ. రెండుమూడేళ్ల పాటు వాళ్ల డైరీలన్నీ నిండిపోయి ఉన్నాయి.
మరి వెంటనే షూటింగ్ అంటే అనిల్‌కి దొరికే హీరో ఎవరు? అంటే ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న పేరు ‘నందమూరి బాలకృష్ణ’. నిజానికి మలినేని గోపీచంద్ దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేయాలి. ప్రారంభోత్సవాన్ని కూడా జరుపుకున్న ఈ సినిమా.. సెట్స్‌కి వెళ్లడానికి కాస్త ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు అనిల్ రావిపూడి దగ్గర బాలకృష్ణకు సరిపడా కథ సిద్ధంగా ఉంది. అన్నీ అనుకూలిస్తే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఫిల్మ్ వర్గాల చెబుతున్నాయి. రెండేళ్ల క్రితం బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ‘నేలకొండ భగవంత్ కేసరి’ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతోపాటు, జాతీయ అవార్డును కూడా అందుకున్న విషయం తెలిసిందే.