చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్‌గారు’ సంక్రాంతి బరిలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అత్యంత వేగంగా 300కోట్ల కలెక్షన్ల మైలురాయిని చేరుకున్న తొలి తెలుగు ప్రాంతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సోషల్‌మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. సినిమా విజయాన్ని చూస్తుంటే మనసు కృతజ్ఞతాభావంతో నిండిపోతున్నదని అన్నారు. ‘ఈ రికార్డు తెలుగు ప్రేక్షకులది, డిస్ట్రిబ్యూటర్లది, దశాబ్దాలుగా నా వెంట నిలిచిన అభిమానులది.
థియేటర్లలో మీరు వేసే విజిల్స్, చప్పట్లే నన్ను నడిపించే శక్తి. రికార్డులు వస్తుంటాయి..పోతుంటాయి. కానీ మీరు చూపించే ప్రేమ మాత్రం శాశ్వతం. ఈ బ్లాక్‌బస్టర్ విజయం వెనుక దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత మరియు టీమ్ అందరి కృషి ఉంది. ఈ వేడుకలు ఇలాగే కొనసాగిద్దాం. లవ్ యూ ఆల్’ అంటూ చిరంజీవి తన సందేశంలో పేర్కొన్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నది.