అగ్ర హీరోలతో కలసి భారీ చిత్రాల్లో నటిస్తున్నా.. మంగళూరు సోయగం పూజాహెగ్డేకు అదృష్టం కలిసి రావడం లేదు. బాక్సాఫీస్ ఫలితాల పరంగా ఈ భామ కాస్త నిరుత్సాహంగా ఉంది. అయితే అవకాశాలపరంగా ఎలాంటి లోటులేదని, ఈ ఏడాది బ్లాక్‌బస్టర్ హిట్‌తో ముందుకొస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నది. తాజా ఇంటర్వ్యూలో కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకుందీ భామ. కెరీర్ ఆరంభం నుంచి కమర్షియల్ సినిమాల్లో నటించడం వల్ల మాస్ పల్స్‌ని బాగా అర్థం చేసుకున్నానని తెలిపింది.
గ్లామర్ రోల్స్ కాస్త బోర్ అనిపించినా.. తన స్క్రీన్‌ప్రజెన్స్ చూసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నానని ఈ సొగసరి చెప్పుకొచ్చింది. ‘ఇప్పుడు గ్లామర్ రోల్స్‌పై ఏమాత్రం మక్కువ లేదు. ప్రభావవంతమైన పాత్రలు చేస్తేనే కెరీర్లో లాంగ్విటీ ఉంటుందనే విషయం అర్థమైంది. ఇక ఇండస్ట్రీలో పోటీ గురించి నేను అస్సలు ఆలోచించను. ప్రతిభ ఉంది కాబట్టే ఇప్పటికీ భారీ చిత్రాల్లో అవకాశాలొస్తున్నాయి. భవిష్యత్తులో నటిగా సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా’ అని పూజాహెగ్డే పేర్కొన్నది. ఈ భామ దళపతి విజయ్‌తో కలిసి నటించిన ‘జన నాయగన్’ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.