పాత్రల్లో సహజత్వాన్ని కనబరచడానికి అరువు గొంతులపై ఆధారపడకుండా సొంతగళాన్ని వినిపిస్తున్నారు అగ్రకథానాయికలు. తెలుగు భాషపై పట్టు సాధిస్తూ పాత్రలకు వారే స్వయంగా డబ్బింగ్ చెబుతున్నారు. ‘రాధేశ్యామ్’ సినిమాలో తన పాత్రకు పూజాహెగ్డే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. ఆమె స్టూడియోలో డబ్బింగ్ చెబుతున్న ఫొటోలను చిత్రబృందం ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ‘ప్రేరణ డబ్బింగ్ చెప్పడం పూర్తిచేసింది. సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేము మరో అడుగు ముందుకు వేశాం’ అంటూ పేర్కొన్నారు. కెరీర్ ఆరంభంలో డబ్బింగ్ ఆర్టిస్ట్‌లపై ఆధారపడిన పూజాహెగ్డే ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమా నుండి తన రూటు మార్చి సొంత గళాన్ని వినిపిస్తోంది. ‘రాధేశ్యామ్’లో ప్రేరణ పాత్ర కోసం ఆమె గొంతు చక్కగా సరిపోయిందని చిత్రయూనిట్ చెబుతోంది. 1970-80 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్నారు. రాధాకృష్ణకుమార్ దర్శకుడు. జనవరి 14న ప్రేక్షకుల ముందుకురానున్నది.