కరీంనగర్, మార్చి 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే యువత అతిగా ఆలోచిస్తే భయం, ఆత్రుత మొదలవుతాయి. మనసును ప్రశాంతంగా ఉంచుకొంటేనే విజయానికి బాటలు పడుతాయి. ఒక ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అవ్వాలి. పదే పదే చదవడం కన్నా, చిన్న నోట్స్ రాసుకొని రివిజన్ చేయడం ద్వారా ఫలితాలు ఉంటాయి’ అని కరీంనగర్‌కు చెందిన యువ మానసిక వైద్యనిపుణుడు డాక్టర్ సాయికృష్ణ చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 80 వేలకుపైగా పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో యువత ప్రిపరేషన్ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఎలా ప్రిపేర్ కావాలి? ఒత్తిడిని ఎలా జయించాలి? ఎలాంటి పద్ధతులు పాటించాలి? తదితర అంశాలపై ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
పోటీ పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలి?
నోటిఫికేషన్లు అకస్మాత్తుగా వచ్చేసరికి కొందరు భయపడుతారు. ఒత్తిడికి లోనవుతారు. ముందునుంచీ ప్రిపేర్ అయ్యేవాళ్లు పాజిటివ్‌గా తీసుకొని పరీక్షకు సన్నద్ధం అవుతారు. భయం, ఆత్రుత భవితను దెబ్బతీస్తాయి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఒత్తిడిని జయిస్తే సగం గెలిచినట్టే.
ఒత్తిడికి గురికాకుండా ఎలా ముందుకు సాగాలి?
ప్రణాళిక రెండు రకాలుగా ఉండేలా చూసుకోవాలి. ఒకటి షార్ట్ టైం ప్రణాళిక, రెండు లాంగ్ టైం ప్రణాళిక. షార్ట్ టైం అంటే ఈ రోజుతోపాటు వారం రోజుల్లో ఏం చేయాలో చూసుకోవాలి. లాంగ్ టైం అంటే ఒకటి, రెండు నెల్లలో ఏం చదవాలన్నది చూసుకోవటం. మనిషి మెదడు ఎలా డిజైన్ చేయబడి ఉంటుందంటే.. మనం ఏదైతే చూస్తామో? చదువుతామో? అది ముందు మన షార్ట్ టైం మెమొరీలో రిజిస్టర్ అవుతుంది. ఈ షార్ట్ టైం మెమొరీ నుంచి లాంగ్ టైం మెమొరీలోకి వెళ్లాలంటే నిత్యం రివిజన్ జరగాలి. ఈ రివిజన్ అనేది కొందరికి వారంకోసారి అవసరం కావచ్చు. మరికొందరికి రెండు, మూడు వారాలు లేదా నెల పట్టొచ్చు. రివిజన్ అంటే మొత్తం పుస్తకం చదవాలని కాదు.. చిన్న నోట్స్ రాసుకొని రిమైండర్స్ పెట్టుకొని రివిజన్ చేయటం. అలా చేస్తే షార్ట్ టైం నుంచి లాంగ్ టైం మెమొరీలోకి విషయం వెళ్తుంది. లాంగ్ టైం మెమొరీలోకి వెళ్లినవాళ్లలో స్కిల్స్ పెరుగుతాయి.
జ్ఞాపక శక్తి, శరీరంపై నిద్ర ప్రభావం ఎంత?
పరీక్ష షెడ్యూల్ రిలీజ్ కాగానే కొంతమంది నిద్రపోకుండా అంతా చదవాలి అన్న దృష్టితో ఉంటారు. నిద్ర, ఆహారాన్ని తగ్గించుకొంటారు. మానసిక శాస్త్రంలో వైద్యులు గమనించినంత వరకు మెమొరీ సరిగ్గా ఉండాలంటే.. సరిపడా న్యూట్రిషన్ ఫుడ్ అందాలి. కొద్దోగోప్పో శారీరక శ్రమ ఉండాలి. ఇదే సమయంలో సరిపడేంతా నిద్ర ఉండాలి. మెమొరీ బాగుండాలంటే సగటున 6 నుంచి 8 గంటల నిద్ర ఉండాలి. సరిపడా భోజనం, నిద్ర ఉండాలి.
భయం, ఆత్రుత అనర్థాలు ఏమిటి?
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నప్పుడు తెలియకుండానే ఒత్తిడికి లోనవుతారు. లైఫ్ ఇంకా సెటిల్ కాలేదు.. ఈ ఎగ్జామ్ ఒక్కటే నా జీవితం అన్నట్టు ఆలోచించటం మొదలు పెడతారు. ఇలాంటి వాళ్లలో తెలియని భయం, ఆత్రుత మొదలవుతాయి. వీటిని తట్టుకొనే శక్తి అందరికీ ఉండదు. కొంతమంది ఆత్మహత్యల వరకు వెళ్తారు. లైఫ్‌లో ఇదో చిన్న పరీక్ష.. ఇది కాకపోతే ఎన్నో ఉన్నాయన్న విషయాన్ని నిరుద్యోగులు అర్థం చేసుకొని ముందుకుసాగాలి. భయాందోళనకు గురికాకుండా ఉండాలంటే ఒక రిలాక్సేషన్ ప్రాక్టీస్ చేసుకోవాలి.
యువతకు మీరిచ్చే సూచనలేంటి?
కొందరు విద్యార్థులు రిలాక్సేషన్ పేరుతో మత్తు పదార్థాలు తీసుకొంటారు. సిగరెట్, మద్యపానం, డ్రగ్స్ వంటివి. నిజానికి ఇటువంటి వాటికి ఎంతదూరంగా ఉంటే అంత మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగం సాధించాలంటే ఏం కావాలో ముందుగా నిర్ణయించుకోవాలి. లక్ష్య సాధనకు సరిపడా వసతులు ఏర్పాటు చేసుకోవాలి.
ఎక్కువసేపు చదివితే ఏకాగ్రత కోల్పోతారని అంటారు. నిజమేనా?
ఒక అంశంపై మనిషి ఏకాగ్రత సగటున అనేది సగటున 30 నుంచి 40 నిముషాల వరకు మాత్రమే ఉంటుంది. అది కూడా పూర్తి ఏకాగ్రత ఉన్నవారికి మాత్రమే. ఇది సగటున 20 నిముషాలకు మించి ఉండకపోవచ్చు. అంటే ప్రతి 20 నిముషాలకోసారి మన మనసు ఏదో ఒక విషయంపైకి మళ్లుతుంది. రెగ్యులర్‌గా సాధన చేసేవారి ఏకాగ్రత రోజురోజుకూ పెరుగుతూ ఉంటుంది. అందుకోసం ఒక సైకలాజికల్ బ్రేక్ తీసుకోవాలి. అంటే.. నచ్చిన ఏదైనా మెమొరీని నెమరేసుకోవాలి. అది చిన్న పాటలా కూడా కావచ్చు. కండ్లు మూసుకోవడం, నీళ్లు తాగడం వంటివి చేయాలి. గంటలు గంటలు చదివే విద్యార్థులకు నా సూచన ఏమిటంటే.. ప్రతి 30 నిమిషాలకు ఒక చిన్న బ్రేక్ తీసుకొంటే దీర్ఘకాలికంగా మంచి ఫలితాలు వస్తాయి.