మహబూబ్‌నగర్ టౌన్, మార్చి 30 : గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థులకు ప్రత్యేక శిక్షణనిచ్చి భావిశాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అవకాశాన్ని కల్పిస్తున్నది. ఏటా ఆసక్తి ఉన్న విద్యార్థులను గుర్తించి అంతరిక్ష పరిశోధనలపై ప్రాథమికంగా అవగాహన కల్పిస్తున్నది. ఇందులో భాగంగా ఈ ఏడాది యువ విజ్ఞాన్ కార్యక్రమ్ (యువికా) నిర్వహిస్తూ భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్ధడమే లక్ష్యంగా శిక్షణ ఇస్తున్నది. ఇందుకోసం 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
దేశవ్యాప్తంగా ఐదు చోట్ల శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తిరువనంతపురంలోని విక్రమ్ సారాబాయి స్పేస్‌సెంటర్, బెంగళూరులోని యూఆర్‌రావు శాటిలైట్ సెంటర్, అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్, హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, షిల్లాంగ్‌లోని నార్త్-ఈస్ట్ స్పేస్ అప్లికేషన్ కేంద్రాల్లో విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వనున్నారు.
వేసవి సెలవుల్లో మే 16 నుంచి 28వ తేదీ వరకు 13 రోజులపాటు విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. విద్యార్థుల ప్రయాణం, బస, భోజన వసతితో వంటి అన్ని ఖర్చులను ఇస్రో భరించనున్నది. విద్యార్థితోపాటు తల్లిదండ్రుల్లో ఒకరు లేదా గైడ్‌గా ఉపాధ్యాయుల్లో ఎవరైనా ఒకరికి మాత్రమే ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు. ధ్రువీకరణ పత్రం అందజేసి శ్రీహరికోటలో సతీశ్‌ధావన్ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లి అక్కడి విశేషాలను ప్రత్యేక్షంగా చూపించనున్నారు.
ఎనిమిదో తరగతిలో పొందిన మార్కులు, మూడేండ్లలో పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శన, సైన్స్ ప్రతిభ పరీక్ష ఒలింపియాడ్‌లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. రిజిస్టర్డ్ క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ చాటిన వారు.., స్కౌట్ అండ్ గైడ్స్, ఎన్సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌లలో సభ్యులుగా ఉన్న, ఆన్లైన్ క్విజ్‌లో సత్తా చాటిన విద్యార్థులకు అవకాశం ఉంటుంది.
యువికా శిక్షణకు విద్యార్థులు నాలుగు దశల్లో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. మొదట ఈ-మెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ తరువాత 48 గంటల వ్యవధిలో ఇస్రో నిర్వహించే ఆన్లైన్ క్విజ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తైన 60 నిమిషాల తర్వాత యువికా పోర్టల్‌లోని ఆన్లైన్ దరఖాస్తులో పూర్తి వివరాలను నమోదు చేసి అప్లోడ్ చేయాలి. దరఖాస్తుతోపాటు విద్యార్థి సంతకం చేసిన ప్రతి, మూడేండ్లలో వివిధ అంశాల్లో సాధించిన ప్రగతికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు పొందుపర్చాలి. ఏప్రిల్ 10వ తేదీ వరకు దరఖాస్తు సమర్పణకు అవకాశం కల్పించారు. ఏప్రిల్ 20న ఎంపిక జాబితాను ప్రకటించి అర్హత సాధించిన వారి వివరాలను నేరుగా తెలియజేస్తారు. చురుకైన, ఆసక్తి ఉన్న విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని, నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సమగ్ర శిక్ష సమన్వయ జిల్లా అధికారి వెంకట్రామిరెడ్డి సూచించారు.