Zomato Q4 Results | 2021-22 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఆన్లైన్ ఫుడ్ అగ్రిగేటర్ జొమాటో నష్టం దాదాపు మూడు రెట్లు పెరిగింది. 2020-21 మార్చి త్రైమాసికంలో రూ.131 కోట్ల నష్టాన్ని చవి చూసింది జొమాటో. గత మార్చి త్రైమాసికంలో జొమాటో నష్టాలు రూ.360 కోట్లకు పెరిగాయి. ఆదాయం 75 శాతం పెరగడం గమనార్హం. 2020-21 మార్చి త్రైమాసికంలో రూ.692 కోట్ల ఆదాయం తెచ్చుకున్న జొమాటో 2021-22 జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.1212 కోట్ల ఆదాయం పొందింది. దీంతో ఎన్ఎస్ఈలో సోమవారం జొమాటో స్టాక్ 2.15 శాతం నష్టపోయి రూ.56.80 వద్ద ముగిసింది.
డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే మార్చి త్రైమాసికంలో జొమాటో స్థూల ఆర్డర్ల విలువ ఆరు శాతం పెరిగితే, గతేడాది మార్చి త్రైమాసికంతో పోలిస్తే 77 శాతం పెరిగి రికార్డు స్థాయిలో రూ.5,850 కోట్లకు చేరుకున్నది. సగటున నెలవారీగా కస్టమర్ల లావాదేవీలు 1.57 కోట్లకు పెరిగాయి. ఇది కూడా ఆల్‌టైం రికార్డే. గతేడాది త్రైమాసికంలో 1.53 కోట్ల లావాదేవీలు మాత్రమే. మార్చితో ముగిసిన త్రైమాసికంలో 300కి పైగా నగరాల్లో తమ సేవలు ప్రారంభించామని జొమాటో తెలిపింది.