Zomato | ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జొమాటో తన సేవలను విస్తరించాలని నిర్ణయించుకున్నది. ఆర్థిక సేవల వ్యాపారంలోకి అడుగు పెట్టనున్నది. ఇందుకోసం బ్యాంకేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇది జొమాటో అనుబంధ సంస్థగా ఉండనున్నది. ప్రతిపాదిత పెయిడ్ అప్ క్యాపిటల్ రూ.3 కోట్లు, ఆథరైజ్డ్ క్యాపిటల్ రూ.10 కోట్లు ఉంటే.. ఎన్బీఎఫ్సీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ నిర్ణయాన్ని బట్టి సంస్థ పేరును ఖరారు చేస్తామని బీఎస్ఈ ఫైలింగ్‌లో జొమాటో వెల్లడించింది. ఒక సంస్థ తన అనుబంధ ఆర్థిక సేవల సంస్థ ఏర్పాటు చేయడానికి ఆర్బీఐ ఆమోదం తప్పనిసరి.
జొమాటోను దీపిందర్ గోయల్, పంకజ్ చద్దా 2008లో స్థాపించారు. ఇది ప్రమోటర్ లేదా ప్రమోటర్ల గ్రూప్ లేకుండా ప్రొఫెషనల్‌గా నడుపుతున్న సంస్థ. 2020 డిసెంబర్లో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ ఇన్‌క్రెడ్‌తో ఒప్పందంపై జొమాటో సంతకాలు చేసింది. తదుపరి జొమాటో తన రెస్టారెంట్ పార్టనర్లకు రుణాలు విస్తరించింది. కరోనా మహమ్మారి వేళ ఫుడ్ డెలివరీ పరిశ్రమ పూర్తిగా దెబ్బ తిన్న సంగతి తెలిసిందే.
ఆర్బీఐతోపాటు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి అనుమతులు వచ్చిన తర్వాత కంపెనీ పేరును జొమాటో ఖరారు చేయనున్నది. మరోవైపు హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్నయాడ్ అన్మో అనే స్టార్టప్‌లోనూ జొమాటో వాటాలు కొనుగోలు చేసినట్లు తెలిసింది. అర్బన్ పైపర్లో ఐదు శాతం వాటాలు తీసుకున్నది.మరో మూడు సంస్థల్లోనూ జొమాటో వాటాలు కొనుగోలు చేసినట్లు వార్తలొచ్చాయి.