న్యూఢిల్లీ, నవంబర్ 11: కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) చేస్తున్న దర్యాప్తును మీడియాలో వస్తున్న వార్తలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ జొమాటో, స్విగ్గీ తెలిపాయి. నిబంధనల్ని పాటించకుండా వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నారన్న కేసులో ఇంకా సీసీఐ ఏ తుది ఆదేశాలూ ఇవ్వలేదని స్పష్టం చేశాయి.
తాము దేశీయ చట్టాలను అనుసరించే పనిచేస్తున్నామని జొమాటో పేర్కొనగా, స్థానిక నిబంధనలకు కట్టుబడి ఉన్నామని స్విగ్గీ వెల్లడించింది. కొన్ని రెస్టారెంట్ భాగస్వాములకు ప్రాధాన్యతనిస్తూ జొమాటో, స్విగ్గీ వ్యవహరిస్తున్నాయని, ఇది మార్కెట్లో పోటీ వాతావరణాన్ని దెబ్బతీస్తున్నదంటూ సీసీఐకి నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు చేసింది. దీనిపై 2022 ఏప్రిల్లో విచారణకు సీసీఐ ఆదేశించింది.