న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: ఆన్లైన్ ఫుడ్, గ్రాసరీ డెలివరీ దిగ్గజం జొమాటో.. పేరు మార్చుకుంటున్నది. ఎటర్నల్‌గా మారిపోతున్నది. ఇందుకు గురువారం జొమాటో సంస్థ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే కంపెనీ వాటాదారులు, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సంబంధిత అధికార వర్గాలు ఆమోదించాల్సి ఉన్నది. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో జొమాటో పేర్కొన్నది.
కాగా, ఫుడ్ డెలివరీ బిజినెస్ బ్రాండ్ జొమాటో యాప్ పేరు మాత్రం అదే. ‘పేరు మార్పునకు మా బోర్డు అంగీకరించింది. షేర్‌హోల్డర్స్ కూడా మద్దతివ్వాలని కోరుతున్నాను. కావాల్సిన అనుమతులన్నీ వచ్చాక మా కార్పొరేట్ వెబ్సైట్ పేరు జొమాటో.కామ్ నుంచి ఎటర్నల్.కామ్‌గా మారిపోతుంది. మా స్టాక్ టిక్కర్నూ మారుస్తాం’ అని జొమాటో వ్యవస్థాపక సీఈవో దీపిందర్ తెలిపారు. ఎటర్నల్‌లో జొమాటో, బ్లింకిట్, డిస్ట్రిక్ట్, హైపర్‌ప్యూర్ అనే 4 వ్యాపార విభాగాలుండనున్నాయి.