Kaivalya Vohra | జెప్టో.. ఓ క్విక్ కామర్స్ స్టార్టప్ సంస్థ.. దీని సహ వ్యవస్థాపకులు కైవల్య వోహ్రా.. అదిత్ పలిచా.. 2024 హురున్ ఇండియా సంపన్నుల్లో యువ పారిశ్రామిక వేత్తలుగా నిలిచారు. రూ.3,600 కోట్ల సంపదతో కైవల్య వోహ్రా (21) మొదటి స్థానంలో నిలిస్తే తర్వాతీ స్థానంలో అదిత్ పలిచా (22) ఉన్నాడు. కైవల్య వోహ్రా ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం ఇది మూడోసారి. తొలిసారి 19వ ఏట అంటే 2022లోనూ కైవల్య వోహ్రా ఈ స్థానాన్ని కొట్టేయడంతోపాటు వరుసగా మూడో ఏడాది ఆ హవా కొనసాగిస్తున్నాడు. గురువారం హురున్ ఇండియా విడుదల 2024లో భారత కుబేరుల జాబితాలో యువ పారిశ్రామికవేత్తల్లో టాప్- బిలియనీర్లుగా వీరిద్దరు నిలిచారు. ఈ ఏడాది కొత్తగా 272 మంది రూ.1000 కోట్ల పైచిలుకు సంపద పొందిన కొత్త కుబేరులు జత కలిశారు. దీంతో రూ.1000 కోట్ల పై చిలుకు సంపద గల భారతీయ కుబేరుల సంఖ్య 1539 మందికి చేరింది.
స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ విద్యార్థిగా కైవల్య వోహ్రా తన 18వ ఏట అంటే 2021లో విద్యాభ్యాసానికి గుడ్ బై చెప్పాడు. యూనివర్సిటీ సహ విద్యార్థి అదిత్ పాలిచాతో కలిసి జెప్టో సంస్థను స్థాపించారు. 45 నిమిషాల్లో కస్టమర్లకు గ్రాసరీ డెలివరీ ఫ్లాట్ ఫామ్ జెప్టో – కిరాణా కార్ట్ ప్రారంభించారు. తొలుత కిరాణా కార్ట్ అనే పేరుతో మొదలు పెట్టినా తర్వాత కిరాణా కార్ట్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కొనసాగింపుగా జెప్టో ఏర్పాటు చేశారు. కైవల్య వోహ్రా.. ఫోర్బ్స్ ప్రభావ శీలురు -30లో ఆసియా -30 జాబితాలోనూ చోటు దక్కించుకున్నాడు.
బెంగళూరు, లక్నో, ఢిల్లీ, చెన్నై తదితర నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న జెప్టో మార్కెట్ విలువ పైపైకి దూసుకెళ్లింది. 2023 ఆగస్టులో దాని విలువ 1.4 బిలియన్ అమెరికన్ డాలర్లు. కరోనా మహమ్మారి వేళ కస్టమర్లకు గ్రాసరీ సరుకులు సరఫరా చేసేందుకు ప్రారంభించిన జెప్టో.. ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్, స్విగ్గీ ఇన్ సామార్ట్, జొమాటో-బ్లింకిట్, టాటా గ్రూప్ అనుబంధ బిగ్ బాస్కెట్ తదితర సంస్థలకు గట్టి పోటీ ఇస్తున్నది.