Zee- Sony Deal | దేశంలోని ప్రముఖ మీడియా సంస్థ జీ ఎంటర్టైన్మెంట్ సంస్థ.. ‘కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ (గతంలో సోనీ ఇండియా), బంగ్లా ఎంటర్ టైన్ మెంట్ సంస్థలతో సెటిల్మెంట్ ఒప్పందం చేసుకున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఈ ఒప్పందంలో భాగంగా సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ తోపాటు ఎన్సీఎల్టీ, ఇతర న్యాయస్థానాల్లో ముందు దాఖలు చేసిన అన్ని పిటిషన్లను విత్ డ్రా చేసుకుంటున్నట్లు తెలిపింది. రెండేండ్ల క్రితం సోనీ ఇండియాతో చేసుకున్న 10 బిలియన్ డాలర్ల విలీన ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు స్టాక్ ఎక్స్చేంజీలకు ఇచ్చిన సమాచారంలో జీ ఎంటర్టైన్మెంట్ వెల్లడించింది. దీంతో మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో జీ షేర్లు 11 శాతం పెరిగి రూ.150.90 వద్ద ముగిశాయి.
సుమారు రెండేండ్ల తర్వాత విలీన ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు సోనీ గ్రూప్ కార్పొరేషన్ గత జనవరి 22న ప్రకటించడంతో రెండు సంస్థల మధ్య వివాదం తలెత్తింది. దీంతో ఇరు పక్షాలు కోర్టులను ఆశ్రయించాయి. 2022లో జీ ఎంటర్ టైన్ మెంట్, సోనీ గ్రూప్ ఇండియా విలీన ఒప్పందం కుదుర్చుకున్నాయి. గతేడాది ఆగస్టు 10న బీఈపీఎల్, కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్ మెంట్ సంస్థలతో జీ ఎంటర్టైన్మెంట్ ఒప్పందాన్ని ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ ఆమోదించింది. అయితే, విలీన ఒప్పందం నుంచి వైదొలిగినందున రెండు సంస్థలు విడిగా తమ సంస్థల వృద్ధికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.