YouTube Layoffs : 43 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులతో కూడిన యూట్యూబ్ మ్యూజిక్ టీమ్ తమ కొలువులు కోల్పోయింది. ఈ ఉద్యోగులు గత ఏడాది కాలంగా మెరుగైన వేతనాలు, ప్రయోజనాలను డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల బృందం గూగుల్, కాగ్నిజెంట్‌ల కోసం పనిచేస్తున్నారు. మరోవైపు ఈ లేఆఫ్స్‌కు తాము బాధ్యులం కాదని గూగుల్ స్పష్టం చేసింది. మరోవైపు గూగుల్‌తో తమ యూనియన్ సంప్రదింపులకు మద్దతుగా నిలవాలని యూట్యూబ్ డేటా అనలిస్ట్ జాక్ బెనెడిక్ట్ అస్టిన్ సిటీ కౌన్సిల్‌ను కోరుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తనతో సహా 43 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను విధుల నుంచి తొలగించారని ఆయన కౌన్సెల్‌కు వివరించారు. తమను విధుల నుంచి తొలగించడంతో షాక్‌కు గురయ్యామని అసలు ఏం చేయాలో తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తాము గత ఏడాదిగా మెరుగైన వేతనాలు కోరుతున్నందుకు ప్రతీకారంగానే లేఆఫ్స్‌కు తెగబడ్డారని ఉద్యోగులు పేర్కొంటున్నారు. తమను కంపెనీ ఉన్నట్టుండి వీధిన పడేయడంతో ఇంటి ఈఎంఐల పరిస్ధితేంటని బాధితులు వాపోతున్నారు.
తమకు ఎలాంటి ముందస్తు నోటీసులు జారీ చేయలేదని, అనూహ్యంగా లేఆఫ్స్‌కు తెగబడ్డారని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక కాంట్రాక్ట్ వర్కర్ల తొలగింపుతో తమకు సంబంధం లేదని, వీరిని కాగ్నిజెంట్ నియమించుకుందని గూగుల్ పేర్కొంది. ఇక వీరి కాంట్రాక్ట్ గడువు ముగిసిందని కాగ్నిజెంట్ వివరణ ఇచ్చింది. కంపెనీలో ఇతర విభాగాల్లో వీరిని సర్దుబాటు చేసేందుకు ఏడు వారాల పాటు వేతనం చెల్లిస్తామని పేర్కొంది.
Read More :