న్యూఢిల్లీ, డిసెంబర్ 17: దేశంలోని యువత ఖర్చుల పోకడపై ‘సూపర్.మనీ’ సంస్థ ఓ అధ్యయనం చేపట్టింది. ఇంకేముంది స్మార్ట్ఫోన్లు, బట్టల లావాదేవీలే ఎక్కువని అనుకుంటున్నారా? అయితే మీరు తప్పులో కాలేసినట్టే. మెజారిటీ యూత్ రోజువారీ ఖర్చుల రూటు మారిపోయింది మరి. నేటి జెన్ జెడ్ (1997 నుంచి 2012 మధ్య జన్మించినవారు) యూపీఐ ద్వారానే ఎక్కువ చెల్లింపులు జరుపుతుండగా, చిన్నచిన్న కొనుగోళ్లకే అధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు తేలింది. దేశవ్యాప్తంగా గడిచిన ఏడాది కాలంలోని లక్షలాది డిజిటల్ పేమెంట్స్‌ను గమనించి నిర్వాహకులు ఈ తాజా సర్వేను జరిపారు. కాగా, రుణాల విషయంలోనూ యువ భారతం జాగ్రత్తగా ఉంటున్నట్టు ఈ సందర్భంగా బయటపడటం విశేషం.
దేశ యువత డిజిటల్ పేమెంట్స్‌లో దాదాపు 76 శాతం రోజువారీ లావాదేవీలు రూ.200లోపే ఉండటం గమనార్హం. అయితే అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పుడ్ ఆర్డర్లు పెరిగిపోవడం ఒకింత ఆందోళనకు గురిచేస్తున్నది. మారిన యువత జీవనశైలి, ఆహార అలవాట్లకు ఇది అద్దం పడుతున్నది. ఇక ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు కిరాణా, సూపర్ మార్కెట్లలో లావాదేవీలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మెట్రో నగరాలు, ఇతర నగరాలు, పట్టణాల్లోనైతే ఈ వేళల్లో డిజిటల్ పేమెంట్స్ విపరీతంగా జరుగుతున్నాయి.
సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉరుకుల, పరుగుల జీవనం గడుపుతున్న భారతీయ యువత.. శుక్రవారం సాయంత్రం నుంచి విశ్రాంతి మోడ్‌లోకి వెళ్లిపోతున్నది. ప్రధానంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు వారాంతపు ఉత్సాహంలో మునిగిపోతున్నారు. ఇక శుక్రవారం రాత్రి 7-8 గంటల సమయంలో ప్రతి వారం పెద్ద ఎత్తున లావాదేవీలు నమోదవుతున్నాయి. పుడ్, ఎంజాయ్మెంట్, చిన్నచిన్న సరదాలకు అంతా అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్టు తేలింది.
ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల యువత తీరూ ఇంతేనని సర్వే చెప్పింది. కాగా, అప్పుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న యువత.. ఎఫ్డీ పూచీకత్తు ఆధారిత క్రెడిట్ కార్డులను తీసుకునేందుకు అమితాసక్తిని ప్రదర్శిస్తున్నట్టు స్పష్టమైంది. తద్వారా బాధ్యతాయుత ఖర్చులకు పెద్దపీట వేస్తున్నారని, అటు పొదుపు, ఇటు రుణ ప్రయోజనాలను పొందుతున్నారని ‘సూపర్.మనీ’ అభిప్రాయపడింది.