Gold Price | న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఆల్‌టైమ్ హైకి చేరాయి. శుక్రవారం 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) తులం రేటు ఢిల్లీలో మునుపెన్నడూ లేనివిధంగా లక్ష రూపాయలకు సమీపిస్తూ రూ.96,450గా నమోదైంది. ఈ ఒక్కరోజే ఏకంగా రూ.6,250 పుంజుకోవడం గమనార్హం. జ్యుయెల్లర్స్, రిటైలర్స్ నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ రావడం, దేశ-విదేశీ ఆర్థిక, వాణిజ్య పరిణామాలు, మదుపరుల పెట్టుబడులు వంటివి ధరలు పెరగడానికి కారణమయ్యాయని అఖిల భారత సరఫా అసోసియేషన్ తెలిపింది. ముఖ్యంగా అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం అంతకంతకూ ఉగ్రరూపం దాల్చుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లంతా స్టాక్, బాండ్ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను సురక్షిత మదుపు సాధనమైన బంగారం వైపునకు మళ్లిస్తున్నారని, ఇది కూడా గ్లోబల్ మార్కెట్లో పసిడి ధరల పరుగులకు దారితీస్తున్నదని మార్కెట్ నిపుణులు ప్రస్తుత ట్రెండ్‌ను విశ్లేషిస్తున్నారు.
హైదరాబాద్‌లో..
హైదరాబాద్‌లోనూ పుత్తడి ధరలు సరికొత్త రికార్డులను తాకాయి. 24 క్యారెట్ 10 గ్రాములు రూ.95,400 పలికింది. ఈ ఒక్కరోజే రూ.2,020 ఎగబాకింది. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత లేదా నగల బంగారం) తులం విలువ కూడా రూ.1,850 ఎగిసి రూ.87,450గా ఉన్నది. ఇదిలావుంటే వెండి ధర రూ.95,500కు పెరిగింది. గతంతో పోల్చితే రూ.2,300 పుంజుకున్నది. కొనుగోలుదారులు, పరిశ్రమ వర్గాల నుంచి డిమాండ్ పెరుగుతుండటం వల్లే రేట్లు పెరుగుతున్నాయని బులియన్ ట్రేడర్లు చెప్తున్నారు. ఇక గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 3,237.39 డాలర్లుగా ఉన్నది.
ఫ్యూచర్ మార్కెట్లో..
ఫ్యూచర్ మార్కెట్లోనూ బంగారం ధరలు దౌడు తీస్తున్నాయి. గతంలో ఎన్నడూలేనంతగా పెరిగి ఆల్‌టైమ్ హై రికార్డుల్ని నెలకొల్పాయి మరి. జూన్ డెలివరీకిగాను మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ (ఎంసీఎక్స్)లో తొలిసారి 10 గ్రాములు రూ.1,703 పెరిగి రూ.93,736 పలికింది. అటు కోమెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్లోనైతే ఔన్స్ 3,249.16 డాలర్లు పలికింది. ప్రతీకార సుంకాలను అమెరికా అధ్యక్షుడు 90 రోజులపాటు నిలుపుదల చేసినా.. చైనాకు మాత్రం ఆ మినహాయింపు ఇవ్వకపోవడం, ఇరు దేశాలు పరస్పర అదనపు సుంకాలు వేసుకుంటూపోతుండటంతో స్పాట్ మార్కెట్‌తోపాటు ఫ్యూచర్ మార్కెట్లోనూ గోల్డ్ రన్ కొనసాగుతున్నదని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.