Yamaha | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ‘ఇండియా యమహా మోటార్’ సుమారు మూడు లక్షల రేజడ్ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రీడ్, ఫాస్కినో 125 ఎఫ్ఐ హైబ్రీడ్ స్కూటర్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. 2022 జనవరి ఒకటో తేదీ నుంచి 2024 జనవరి నాలుగో తేదీ మధ్య తయారైన స్కూటర్లు రీకాల్ చేస్తున్నామని తెలిపింది. రెండు 125సీసీ స్కూటర్లలో బ్రేక్ లివర్ ఫంక్షన్లో సమస్య తలెత్తడమే దీనికి కారణమని తెలిపింది. కస్టమర్లకు ఉచితంగా ఈ విడి భాగాలను రీ ప్లేస్ చేస్తామని వెల్లడించింది. కస్టమర్లు ఇండియా యమహా మోటార్ వెబ్ సైట్ లోకి వెళ్లి సర్వీస్ సెక్షన్ లోకి లాగిన్ అయి తమ వివరాలు తెలుపాలన్నారు.
సర్వీస్ సెక్షన్లో లాగిన్ అయిన తర్వాత ఎస్సీ 125 వాలంటరీ రీకాల్ లోకి వెళ్లి మీ స్కూటర్ చేసిస్ నంబర్ నమోదు చేసి, తదుపరి స్టెప్ తెలుసుకోవాలని పేర్కొంది. మీకు సమీపక యమహా సర్వీస్ సెంటర్ కు గానీ 1800-420-1600 టోల్ ఫ్రీ నంబర్ కు గానీ ఫోన్ చేసి తదుపరి వివరాలు తెలుసుకోవాలని ఇండియా యమహా మోటార్ వెల్లడించింది.
ఇంతకుముందు 2013 జూలైలో 56,082 సైగ్నస్ రే స్కూటర్లు యూనిట్లు, 2014 మార్చిలో 138 ఆర్1 మోటారు సైకిళ్లు, 2019లో ఎఫ్‌జడ్ మోటారు సైకిళ్లు 7757 రీకాల్ చేసింది. దీంతో ఇప్పటి వరకు ఇండియా యమహా మోటార్స్ రీకాల్ చేసిన మోటారు సైకిళ్లు, స్కూటర్ల సంఖ్య 3,63,977 యూనిట్లకు చేరింది. ఇంతకుముందు 2021 మే నెలలో హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా 6,15,666 యూనిట్ల మోటారు సైకిళ్లు రీకాల్ చేసింది. వాటిల్లో యాక్టివా 5జీ /6జీ /125, సీబీ షైన్, సీబీ 300ఆర్, హెచ్ నెస్ సీబీ350, ఎక్స్-బ్లేడ్, హార్నెట్ ఉన్నాయి.