న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: ధరల పరుగు ఆగడం లేదు. ముడి చమురు, ఇతర కమోడిటీలు పెరిగిన ప్రభావంతో అన్ని ఉత్పత్తుల టోకు ధరలు భగ్గుమన్నాయి. 2022 మార్చి నెలలో హోల్‌సేల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) నాలుగు నెలల గరిష్ఠం 14.55 శాతానికి చేరింది. 2021 ఏప్రిల్ తర్వాత టోకు ద్రవ్యోల్బణం వృద్ధిశాతం రెండంకెల్లో నమోదుకావడం వరుసగా ఇది 12వ నెల.ఈ పరిణామంతో రిజర్వ్‌బ్యాంక్ రేట్ల అదుపునకు రంగంలోకి దిగుతుందని, వడ్డీ రేట్లను పెంచుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం పెరుగుదల 13.11 శాతంకాగా, గత ఏడాది మార్చిలో 7.89 శాతంగా ఉంది. 2021 నవంబర్‌లో ఇది 14.87 శాతం గరిష్ఠస్థాయిని చూసింది. సోమవారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ మార్చి నెలలో టోకు ద్రవ్యోల్బణం పరుగులు తీయడానికి ప్రధాన కారణం ముడి చమురు ధరలే. వీటితో పాటు సహజవాయువు, బేసిక్ మెటల్స్ తదితరాలు బాగా పెరిగాయి. క్రూడ్ పెట్రోలియం ద్రవ్యోల్బణం ఏకంగా 55.17 శాతం నుంచి 83.56 శాతానికి చేరింది. టోకు ద్రవ్యోల్బణం సూచీలో ఇంధనం, విద్యుత్ బాస్కెట్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరికంటే మార్చిలో 31.50 శాతం నుంచి 34.52 శాతానికి పెరిగింది.
భగ్గుమన్న టోకు ధరలుఆహారోత్పత్తుల ధరలు 2022 ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో కాస్త నెమ్మదించాయి. ఆహారోత్పత్తుల టోకు ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 8.19 శాతంకాగా, మార్చిలో 8.06 శాతం. టోకున కూరగాయల ధరల వృద్ధి శాతం 26.93 నుంచి 19.88కు దిగింది. ఆహారోత్పత్తుల్లో మొత్తంమీద నెలవారీగా చూస్తే కూరగాయలు, పప్పు దినుసులు ధరల స్పీడ్ తగ్గగా, గోధుమ, ధాన్యం, ఆలుగడ్డ, పాలు, గ్రుడ్లు, మాంసం, చేపల ధరలు మాత్రం ఫిబ్రవరికంటే మార్చిలో అధికంగా పెరిగాయి. మార్చి నెలలో తయారీ ఉత్పత్తుల సైతం మరింత పిరమయ్యాయి. ఈ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం వృద్ధి ఫిబ్రవరి నెలతో పోలిస్తే 9.84 శాతం నుంచి 10.71 శాతానికి చేరింది.
జూన్‌లో ఆర్బీఐ రేట్ల పెంపు
ద్రవ్యోల్బణం అడ్డూఆపూ లేకుండా పెరుగుతున్న దృష్ట్యా ఈ ఏడాది జూన్‌లో రిజర్వ్‌బ్యాంక్ జూన్ నెలలో వడ్డీ రేట్లను పెంచుతుందని అంచనా వేస్తున్నట్టు ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అతిది నాయర్ చెప్పారు. ప్రస్తుత ఏప్రిల్ నెలలో సైతం టోకు ద్రవ్యోల్బణం 13.5-15 శాతం మధ్యలో ఉంటుందని ఇక్రా అంచనా వేస్తున్నది. ఈ ఏడాది రుతుపవనాలు సాధారణంగా ఉన్నా, వంటనూనెలు తదితర ఆహారోత్పత్తుల పెరుగుదలకు బ్రేక్‌లు పడబోవని భావిస్తున్నామని నాయర్ అన్నారు. తయారీ, సర్వీసుల రంగాల్లో నెలకొన్న ద్రవ్యోల్బణ ఒత్తిడులు డబ్ల్యూపీఐ డాటాలో కన్పిస్తున్నదని అక్యూట్ రేటింగ్స్ చీఫ్ అనలిటికల్ ఆఫీసర్ సుమన్ చౌదరి తెలిపారు. ముడి పదార్థాల ధరల పెరుగుదలతో తయారీ కంపెనీల లాభాల మార్జిన్లు తగ్గనుండటం, మరో వైపు ఉత్పత్తులకు డిమాండ్ పెరగడంతో ఆయా కంపెనీలు మరో రౌండు ధరల్ని పెంచుతాయని ఆయన అంచనా వేశారు. సమీప భవిష్యత్తులో డబ్ల్యూపీఐ వృద్ధి రెండంకెల్లోనే కొనసాగుతుందన్నారు.