ముంబై, ఆగస్టు 19: దేశీయ గోల్డ్ మార్కెట్ ఆశాజనకంగా కనిపిస్తున్నదని.. తక్కువ, మరింత స్థిరమైన ధరలతో వినియోగదారులు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తెలిపింది. ఈ క్రమంలోనే ఈసారి పండుగ సీజన్లో నగల అమ్మకాలు బాగుంటాయన్న అంచనాను వెలిబుచ్చింది. తాజాగా డబ్ల్యూజీసీ భారతీయ గోల్డ్ మార్కెట్ అప్డేట్ ఇచ్చింది. ఇందులో ఇన్నాళ్లూ మార్కెట్లో నెలకొన్న స్తబ్ధత తొలగిపోతున్నట్టు పేర్కొన్నది.
మార్కెట్లో ధరలు పెరిగితే ఆభరణాల విక్రయాలు ప్రభావితం కాగలవని డబ్ల్యూజీసీ స్పష్టం చేసింది. ఈ ఏడాది జనవరి ఆఖర్లో దేశీయ మార్కెట్లో బంగారం ధర ఆల్‌టైమ్ హైని తాకిన విషయం తెలిసిందే. 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) పుత్తడి 10 గ్రాములు తొలిసారి రూ.1,83,000 పలికింది. అయితే ఆ తర్వాత నుంచి క్రమేణా తగ్గుముఖం పట్టాయి. అప్పటితో పోల్చితే ఇప్పటికీ తులం రేటు దాదాపు రూ.25,000 తక్కువగానే ఉన్నది. ఫిబ్రవరి చివర్లో అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలను ఎగదోసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే పెరిగిన డాలర్ డిమాండ్, క్రూడాయిల్ కొనుగోళ్లు.. బంగారంపై పెట్టుబడులను తగ్గించేస్తూ వచ్చాయి. అయితే గత నెల రోజులుగా మళ్లీ రేట్లు పరుగులు పెడుతున్నాయి. నిజానికి జూన్‌లో దిద్దుబాటుకు గురైన పసిడి ధరలు.. జూలైలో స్థిరంగా ఉన్నాయి. కానీ ఈ నెలలో తిరిగి విజృంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మున్ముందూ ఇదే ట్రెండ్ కొనసాగితే మాత్రం పండుగ విక్రయాలు ప్రభావితం కాగలవన్న అభిప్రాయాన్ని డబ్ల్యూజీసీ వెలిబుచ్చింది.
అధిక ధరలతో నగల కొనుగోళ్లకు దూరం జరిగిన కస్టమర్లను ఆకట్టుకొనేందుకు రిటైల్ జ్యుయెల్లర్స్ మార్కెట్లో వివిధ రకాల ఆఫర్లు పెడుతున్నది చూస్తూనే ఉన్నాం. అయితే రాబోయే పండుగ సీజన్లో ఈ పోకడ మరింతగా పెరుగవచ్చన్న అంచనాలున్నాయి. ఇప్పటికే పాత నగల ఎక్సేంజ్, తరుగు-మజూరి ఎత్తివేత, స్పాట్ మార్కెట్ ధరల్లో రాయితీల వంటివి వ్యాపారులు ఆఫర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఆఫర్లు ఇంకా పెరిగితే ఈ పండుగ సీజన్లో గోల్డ్ మార్కెట్ కళకళలాడుతుందన్న ఆశాభావాన్ని డబ్ల్యూజీసీ వ్యక్తం చేసింది. అలాగే ఈ ఏడాది మే, జూన్ నెలలతో పోల్చితే జూలైలో దేశంలోకి పుత్తడి దిగుమతులు పెరిగినట్టు పేర్కొన్నది. ఇది మార్కెట్లో సేల్స్ పెరుగుతాయన్న అంచనాలకు అద్దం పడుతున్నదని అభివర్ణించింది.
దేశీయ స్పాట్ మార్కెట్లో బుధవారం బంగారం ధర తగ్గింది. ఢిల్లీలో 24 క్యారెట్ 10 గ్రాములు రూ.800 దిగి రూ.1,58,000గా ఉన్నది. భౌగోళిక-రాజకీయ అనిశ్చిత పరిస్థితులు బులియన్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నట్టు ట్రేడర్లు చెప్తున్నారు. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల నడుమ ముడి చమురు ధరలు మళ్లీ పెరుగడంతో.. మదుపర్లు తమ పెట్టుబడులను ఆ దిశగా మళ్లిస్తున్నారు. ఇది గోల్డ్ డిమాండ్‌ను పడేస్తున్నది. ఇదిలావుంటే కిలో వెండి ధర రూ.5,730 దిగి రూ.2,35,000కు పరిమితమైనట్టు అఖిల భారత సరఫా అసోసియేషన్ తెలిపింది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) 10 గ్రాములు రూ.850 క్షీణించి రూ.1,42,050గా నమోదైంది. కాగా, గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేటు క్రితం ముగింపుతో పోల్చితే సుమారు 1 శాతం తగ్గి 4,361.76 డాలర్లుగా ఉన్నది. సిల్వర్ రేటు 63.33 డాలర్ల వద్ద స్థిరంగా ట్రేడైంది.