వాషింగ్టన్, జూన్ 8: ఈ ఏడాది దేశ వృద్ధిరేటు 8.3 శాతంగా నమోదు కావచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. వచ్చే ఏడాది 7.5 శాతంగా ఉండొచ్చని తెలిపింది. కరోనా వైరస్ ఉద్ధృతి భయంకరంగా ఉన్నా.. లాక్డౌన్లు, ఆంక్షలు కొనసాగుతున్నా భారత జీడీపీపట్ల ప్రపంచ బ్యాంక్ మాత్రం ఆశాజనకంగానే స్పందించింది. ‘ప్రపంచ వృద్ధి అవకాశాలు’ పేరిట తాజా నివేదికను ప్రపంచ బ్యాంక్ విడుదల చేసింది. ఇదిలావుంటే ప్రపంచ వృద్ధిరేటు ఈ ఏడాది 5.6 శాతంగా ఉండొచ్చని చెప్పింది.