World Bank on Recession | ఆర్థిక రంగానికి వస్తున్న ముప్పుపై ప్రపంచ బ్యాంకు యావత్ ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. 2023 నాటికి యావత్ ప్రపంచం ఆర్థిక మాంద్యం ముప్పునెదుర్కోవాల్సి వస్తుందని గురువారం హెచ్చరించింది. పెరుగుతున్న ధరలను కట్టడి చేయడానికి వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు కీలక వడ్డీరేట్లు పెంచేస్తున్నాయి. దీంతో యావత్ ప్రపంచం ఆర్థిక మాంద్యం కౌగిలిలో చిక్కుకుంటుందని తెలిపింది ప్రపంచ బ్యాంక్. ప్రపంచంలోనే మూడు బలమైన ఆర్థిక వ్యవస్థలు.. అమెరికా, చైనా, యూరోల పురోగతి నెమ్మదించిందని పేర్కొంది. వచ్చే ఏడాది ప్రపంచ ఏకానమీ ఒక మోస్తరు మాంద్యంలో చిక్కుకుంటుందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఆర్థిక మాంద్యం నుంచి కోలుకున్న తర్వాత 1970 నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం శరవేగంగా నెమ్మదిస్తున్నదని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. ఇంతకుముందు ఆర్థిక మాంద్యాల కంటే శరవేగంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వినియోగదారుల విశ్వాసాన్ని కోల్పోతుందని పేర్కొంది. గ్లోబల్ గ్రోత్‌రేట్ శరవేగంగా పడిపోతుందని, మున్ముందు మరింత పడిపోతే పలు దేశాలు ఆర్థిక మాంద్యంలో కూరుకుంటాయని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మల్పాస్ హెచ్చరించారు.
కరోనా ముందు నాటి స్థాయికి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ప్రభుత్వ విధాన నిర్ణయాలు సరిపోవని ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. సరఫరాలో అంతరాయం, లేబర్ మార్కెట్‌పై ఒత్తిళ్లు తగ్గకుండా ముందడుగు వేయలేం అని వెల్లడించింది. కొవిడ్‌కు ముందుతో పోలిస్తే 2023లో ప్రపంచ ద్రవ్యోల్బణం రెట్టింపై ఐదు శాతానికి చేరుతుందని వ్యాఖ్యానించింది.