హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మరో జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. ఈ నెల 11 నుంచి 13 వరకు నగరంలో ప్రపంచ ఆక్వాకల్చర్ ఇండియా-2025 సదస్సు జరుగుతున్నది. ఈ సందర్భంగా పీవీ నరసింహరావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ శరత్చంద్ర మాట్లాడుతూ..ప్రపంచ ఆక్వాకల్చర్ రంగంలో భారతదేశం కీలకంగా మారుతున్న నేపథ్యంలో ప్రపంచ మహాసభలు హైదరాబాద్ వేదికగా జరగడం రాష్ట్రంలో మత్స్యరంగ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు.
ప్రపంచ ఆక్వాకల్చర్ సొసైటీ (డబ్ల్యూఎస్-వాస్), భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్), జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (ఎన్ఎఫ్డీబీ) ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన మత్స్యరంగ శాస్త్రవేత్తలు, ఈ రంగంలో వస్తున్న మార్పులు, వినియోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఉత్పత్తులపై చర్చించనున్నారు.