KTR | హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ సర్కార్ మహిళా పారిశ్రామికవేత్తల చోదకశక్తిగా పనిచేసిందని, అందుకు నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికే నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం పారిశ్రామిక రంగానికి ఇచ్చిన ప్రాధాన్యం ఫలితంగా దేశంలో తెలంగాణ టాప్-3 రాష్ట్రంగా నిలిచిందని ఎక్స్ ద్వారా తెలిపారు.
2020-21లో నీతి ఆయోగ్ నివేదిక విశ్లేషణను పరిశీలిస్తే గర్వంగా ఉందని చెప్పారు. ప్రగతిశీల చర్యల ద్వారా ఉదయం పోర్టల్లో 58 వేలకు పైగా మహిళలు పారిశ్రామిక ఔత్సాహికతను చాటారని పేర్కొన్నారు. అది నాటి తమ సర్కార్ చేసిన గొప్ప ప్రయత్నమని గుర్తుచేశారు. ఎంఎస్ఎంఈ రంగంలో మహిళాభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో ప్రత్యేక పథకాలను రూపొందించిందని పేర్కొన్నారు.
నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎంఎస్ఎంఈల్లో దేశంలోని టాప్-10 రాష్ర్టాలు, వాటి శాతాలు ఇలా
రాష్ట్రం శాతం
పశ్చిమ బెంగాల్ 23.42
తమిళనాడు 10.37
తెలంగాణ 7.85
కర్ణాటక 7.56
ఉత్తరప్రదేశ్ 6.96
ఆంధ్రప్రదేశ్ 6.76
గుజరాత్ 6.67
మహారాష్ట్ర 6.47
కేరళ 4.00
రాజస్థాన్ 3.07