ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు అప్పటిదాకా పొదుపు చేసుకున్న సొమ్మంతా ఆ అత్యవసర పరిస్థితి కోసం వెచ్చించడం పరిపాటి. అన్ని రకాల పొదుపు వనరులు ఆవిరైనప్పుడు చిట్టచివరగా ఈపీఎఫ్ నుంచీ విత్‌డ్రా చేస్తాం. నిజానికి ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) అన్నది మినహాయింపు, మినహాయింపు, మినహాయింపు (ఈఈఈ) పరిధిలోకి వస్తుంది. అంటే.. ఇన్వెస్ట్మెంట్ నుంచి మినహాయింపు, దానిపై వచ్చే వడ్డీకి మినహాయింపు, అలాగే మెచ్యూరిటీ సమయంలో కూడా పన్ను మినహాయింపు ఉంటుంది. ఇలా మూడు రకాల మినహాయింపుల కారణంగా ఈపీఎఫ్‌పై వచ్చే రాబడిపై ఎలాంటి ఆదాయం పన్ను ఉండదు. అయితే అన్ని సందర్భాల్లోనూ ఈ మినహాయింపు వర్తించదు. ఈ మినహాయింపులను పొందాలంటే ఐదేండ్ల సర్వీసును నిరాంటకంగా కొనసాగించి ఉండాలి. అప్పుడే ఈపీఎఫ్ అకౌంట్లోంచి విత్‌డ్రా చేయగా వచ్చిన మొత్తం మీద పన్ను ఉండదు. అయితే కొన్ని ప్రత్యేక అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఐదేండ్లలోపు విత్‌డ్రా చేసినా కూడా ఐటీ చెల్లించాల్సిన అవసరం ఉండదు.
అలాంటి పరిస్థితులేమిటంటే.. అవే మీ సర్వీసు అనారోగ్యం కారణంగా నిలిచిపోతే, మీరు పని చేస్తున్న సంస్థ మూతపడితే, ఉద్యోగి పరిధిలో లేని కారణాలతో సర్వీసు ముగిస్తే. అయితే ఐదేండ్ల సర్వీసు అంటే గత సంస్థలో పనిచేసిన కాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని చట్టం చెప్తున్నది. ఇక నిరుద్యోగంలో నెలకు మించి ఉంటున్నట్టయితే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ స్కీమ్ 1952లోని సెక్షన్ 68హెచ్‌హెచ్ ప్రకారం పీఎఫ్ నుంచి 75 శాతం నిధులను విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన 25 శాతాన్నీ 2 నెలల తర్వాత కూడా నిరుద్యోగంలో ఉంటే విత్‌డ్రా చేసుకోవచ్చు. కాగా, కొవిడ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గతేడాది విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం
నాన్ రిఫండబుల్ అడ్వాన్స్‌ను విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. దీని ప్రకారం మూడు నెలల కాలానికి బేసిక్ వేతనం, డీఏ కలిపితే వచ్చే మొత్తంలో 75 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ ఏడాదిమే 31న రెండోసారీ అవకాశమిచ్చింది.