ముంబై, ఏప్రిల్ 24: ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్‌లు నిరుత్సాహకర ఆర్థిక ఫలితాలతో ఇన్వెస్టర్లకు షాకిచ్చిన నేపథ్యంలో మూడో పెద్ద దేశీయ ఐటీ కంపెనీ అయిన విప్రో మరోసారి బైబ్యాక్‌కు సిద్ధమయ్యింది. షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనను తమ కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఏప్రిల్ 27న జరిగే సమావేశంలో పరిగణనలోకి తీసుకోనున్నట్టు విప్రో సోమవారం స్టాక్ ఎక్సేంజీలకు సమాచారం ఇచ్చింది. ఈ వార్తతో విప్రో షేరు ఒక్క ఉదుటన 2.7 శాతంపైగా పెరిగి రూ.378 వద్ద నిలిచింది. కంపెనీ బోర్డు బైబ్యాక్‌పై నిర్ణయం తీసుకోవడంతో పాటు క్యూ4 ఆర్థిక ఫలితాల్ని సైతం గురువారం వెల్లడించనుంది.
రూ.9,500 కోట్ల బైబ్యాక్
విప్రో మూడేండ్ల క్రితం 2020 లో షేరుకు రూ.400 చొప్పున 23.75 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. ఈ బైబ్యాక్ కోసం రూ. 9,500 కోట్లు ఖర్చుచేసింది. అంతకుముందు 2019లో రూ. 10,500 కోట్లతో షేరుకు రూ.325 చొప్పున 32.31 షేర్లను తిరిగి కొన్నది.