హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో విన్ గ్రూప్ కంపెనీ ఆసియా సీఈవో ఫామ్సాన్ సమావేశమయ్యారు. న్యూఢిల్లీలో శనివారం సీఎంను కలిసిన సీఈవో తెలంగాణలో కీలక ప్రాజెక్టులు నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) తయారీ, బ్యాటరీ స్టోరేజ్ యూనిట్లను స్థాపించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. సోలార్, విండ్ పవర్ ఉత్పత్తి అవకాశాలను పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా డిసెంబర్ 8,9 తేదీల్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025లో పాల్గొనాలని ఫామ్సాన్తోపాటు విన్ గ్రూప్ చైర్మన్ ఫామ్నాట్ వూంగ్లను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, సీఎం కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి బీ అజిత్ రెడ్డి, సెక్రటరీ కోఆర్డినేషన్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.