Old is Gold | బంగారం ధర రూ.లక్ష మార్క్‌ను చేరింది. దాంతో బంగారం కొనుగోలుదారులు తమ రూట్‌ను మార్చుకున్నారు. ప్రస్తుతం పాత ఆభరణాలను మార్చుకుంటూ కొత్త నగలను కొనేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రెండ్ మరింత బలపడింది. ప్రస్తుతం తమ వినియోగదారుల్లో 25శాతం మంది పాత ఆభరణాలను మార్చుకునేందుకు పోటీపడుతున్నారని, గతంలో ఈ సంఖ్య తక్కువగా ఉండేదని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (GJC) చైర్మన్ రాజేష్ రోక్డే పేర్కొన్నారు. ఇంద్రియా ఆభరణాల బ్రాండ్ సీఈవో సందీప్ కోహ్లీ మాట్లాడుతూ పాత బంగారం మార్పిడి కార్యక్రమం తమ వ్యాపారాన్ని పెంచబోతుందన్నారు. వినియోగదారులు పాత ఆభరణాలను విలువైన ఆస్తిగా భావించి.. వాటిని కొత్త డిజైన్లతో మార్చుకుంటున్నారన్నారు. పాత బంగారం మార్పిడి ప్రోగ్రామ్ వినియోగదారులు కొత్త ఆభరణాలు కొనుగోలు చేసేందుకు సహాయపడుతుందన్నారు.
పాత నగలు ఇచ్చి వినియోగదారులు కొత్త డిజైన్ నగలకు పూర్తిస్థాయి ధర చెల్లించకుండానే తీసుకోవచ్చన్నారు. వినియోగదారులకు కొత్త ఆభరణాలు తీసుకున్నామన్న సంతోషం ఉంటుందని సందీప్ కోహ్లీ పేర్కొన్నారు. బంగారం హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేయడంతో.. వినియోగదారులు తమ బంగారాన్ని విక్రయిస్తున్న సమయంలో విలువైన ఆస్తిగా భావిస్తున్నారని తెలిపారు. వినియోగదారులు అభిరుచి, సందర్భానుసారంగా కొత్త బంగారం ఆభరణాలను పాతవాటితో రిప్లేస్ చేస్తున్నారని రాజేష్ రోక్డే తెలిపారు. అయితే, ఈ సందర్భంలో అందరూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తమ బంగారానికి హాల్ మార్క్ ఉందో లేదో నిర్ధారించుకోవాలన్నారు. నగల మార్పిడి, తయారీ ఖర్చులపై దృష్టి సారించాలన్నారు. పాత బంగారం మార్పిడి ఆఫర్స్‌ను పరిశీలించే సమయంలో జ్యువెల్లర్స్ 22 క్యారెట్స్ కంటే తక్కువ బంగారం ఉన్న ఆభరణాలపై కొంత డిడక్షన్ చేస్తారన్నారు. కొన్ని సందర్భాల్లో 22 క్యారెట్‌పై పూత వేసిన పాత ఆభరణాల్లో 22 క్యారెట్ కన్నా తక్కువ కరాటేజ్ ఉన్నప్పటికీ, దాన్ని గుర్తించడం కష్టమన్నారు. పాత బంగారం మార్పిడి ఆఫర్లను ఎంచుకునే ముందు వినియోగదారులు ఈ డిడక్షన్లను అర్థం చేసుకోవాలని సూచించారు.