అవగాహన లేకుండా చెక్కు వెనకాల మీరు చేసే ఒక్క సంతకం.. మీకు ఆర్థిక నష్టాలను తెచ్చిపెడుతుందని తెలుసా? అసలు.. చెక్కుపై ఎప్పుడు? ఎక్కడ? సంతకం పెట్టాలి? అన్నదానిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏం చెప్తున్నదన్నదాని గురించి చాలామందికి తెలియడం లేదు. నిజానికి మనమంతా చెక్కులను వినియోగిస్తూనే ఉంటాం. కానీ కొద్దిమందికే వాటిపై సంతకాలకున్న నియమాలపట్ల అవగాహన ఉంటున్నది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం సరైన సమయంలో, సరైనచోట చెక్కుపై సంతకం చేయడం చాలా కీలకం. వేరేచోట సంతకం పెడితే అది మీకు నష్టాన్నేగాక, మోసం నిందనూ అంటగడుతుంది.
ఆర్డర్ చెక్కును దానిపై రాసిన పేరున్నవారే లేదా సంస్థ ప్రతినిధులే నగదుగా మార్చుకోగలరు. బ్యాంకులో వారి గుర్తింపును చూపించాల్సి ఉంటుంది. ఇక మీరు ఎవరి పేరిటైనా చెక్కును ఇవ్వాల్సి వస్తే.. దాని పైనా, వెనక కూడా సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియనే ఎండార్స్మెంట్ అని పిలుస్తారు. ఇవి చాలా సురక్షితం.
బేరర్ చెక్కును బ్యాంకు లో ఎవరైనాసరే సమర్పించి త్వరగా, సులువుగా నగదు చేసుకోవచ్చు. దీని వెనక సంతకం చేయాల్సిన పనిలేదు. చెక్‌పైన దాన్ని ఇష్యూ చేసినవారి సంతకం ఉంటే సరిపోతుంది. అయితే పేయీ పేరును రాయాల్సిన అవసరం లేకపోవడం, ‘ఆర్ బేరర్’ అని ఉండటంతో దీని క్యారీయింగ్ చాలా రిస్క్‌తో కూడుకుని ఉంటుంది. ఒకవేళ దీన్ని పోగొట్టుకున్నా, ఇతరుల చేతికి వెళ్లినా దుర్వినియోగానికి అవకాశాలు ఎక్కువ. చెక్ దొరికినవారు నేరుగా బ్యాంక్‌కు వెళ్లి, అక్కడ సదరు చెక్కును ఇచ్చి నగదుగా మార్చుకోవచ్చు.
ఏమీ ఆలోచించకుండా చెక్కు వెనకాల సంతకం చేస్తే సమస్యలు తప్పవు. బేరర్ చెక్కు వెనకాల మీరు సంతకం చేస్తే.. దాన్ని ఇతరులు మరింత సులువుగా నగదు చేసుకోవచ్చు. చెక్కుపై వారి పేరును రాసుకుని దర్జాగా నగదును విత్‌డ్రా చేసుకుంటారు. అందుకే బ్యాంకు ల్లో మీరే స్వయంగా బేరర్ చెక్కును వేయదలిస్తే.. దాని వెనకాల మీ సంతకం అక్కర్లేదని ఆర్బీఐ చెప్తున్నది. ఒకవేళ ఎవరికైనా నగదు ఇవ్వాల్సి వస్తే.. వారి పేరిట ఇచ్చే ఆర్డర్ చెక్కులకు మాత్రం వెనకాల మీ సంతకం తప్పనిసరి అంటున్నది. అయినప్పటికీ దీనిపై అవగాహన లేక బేరర్ చెక్కుల వెనకాల చాలామంది సంతకాలు చేసేస్తున్నారు. 90 శాతం మందిది ఇదే పరిస్థితి అని బ్యాంకింగ్ వర్గాలు చెప్తుండటం గమనార్హం. బ్యాంకుల్లో సమస్యలు వస్తేగానీ అసలు విషయం బోధపడదు.
బేరర్ చెక్కుల వెనకాల సంతకాలు చేస్తే.. దాన్ని చేజార్చుకున్నైట్టెతే వెంటనే మీమీ బ్యాంక్ శాఖలకు తెలియపర్చండి. లేదంటే తప్పుడు వ్యక్తులకు అది దొరికితే మీ ఖాతా నుంచి నగదు పోగలదు. అలాగే చెక్కులపై పేర్లను స్పష్టంగా రాయండి. తప్పులు ఉండకూడదు. ఇక బేరర్ చెక్స్, ఆర్డర్ చెక్స్తోపాటు క్రాస్డ్ చెక్స్ లేదా అకౌంట్ పేయీ (బ్యాంక్ ఖాతా ద్వారానే చెల్లింపులు), పోస్ట్ డేటెడ్ చెక్స్ (భవిష్యత్తులో ఒక తేదీ లేదా ఆ తర్వాతే నగదుగా మార్చుకోవచ్చు), స్టేల్ చెక్స్ (ఔట్ డేటెడ్), సెల్ఫ్ చెక్స్ (సొంత ఖాతాల్లో వేసి నగదుగా మార్చుకోవచ్చు) మొదలైనవి కూడా ఉంటాయి.