న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: టోకు ధరల సూచీ కూడా భగ్గుమన్నది. చమురు, విద్యుత్, తయారీ రంగ ఉత్పత్తుల ధరలు భారీగా పుంజుకోవడంతో గత నెలకుగాను టోకు ధరల సూచీ ఏకంగా మూడేండ్ల గరిష్ఠ స్థాయిని తాకింది. మార్చి నెలకుగాను హోల్సేల్ ద్రవ్యోల్బణం 3.88 శాతానికి ఎగబాకినట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా చమురు, విద్యుత్ ఉత్పత్తుల ధరలు ఆకాశాన్ని అంటుతుండటం ఇందుకు కారణమని విశ్లేషించింది.
గడిచిన ఐదు నెలలుగా పెరుగుతూ వచ్చిన టోకు ధరల సూచీ మార్చి నెలకుగాను ఏకంగా 38 నెలల గరిష్ఠ స్థాయిని తాకినట్టు కేంద్ర సర్కార్ తెలిపింది. కమోడిటీ ఉత్పత్తుల ధరలు భగ్గుమంటుండటంతో భవిష్యత్తులో టోకు ధరల సూచీ మరింత పెరిగే అవకాశాలున్నాయని పేర్కొంది. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా కమోడిటీ ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయని, దీంతో ధరల సూచీలు కూడా ఎగువముఖం పడుతున్నదని పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 2.13 శాతంగాను, అంతక్రితం ఏడాది ఇదే నెలలో 2.25 శాతంగా నమోదైన టోకు ధరల సూచీ భారీగా పుంజుకొన్నదని విశ్లేషకులు వెల్లడించారు.
గత నెలలో క్రూడ్ పెట్రోలియం, సహజ వాయువు ఉత్పత్తులతోపాటు ఇతర తయారీ, ఆహారేతర ఉత్పత్తులు, మెటల్స్, ఫుడ్ వస్తువుల ధరలు పెరుగడం వల్లనే ధరల సూచీ అధికంగా నమోదైందని కేంద్ర గణాంకాల శాఖ వెల్లడించింది. ఫ్యూయల్, పవర్ సూచీ 1.05 శాతానికి చేరుకోగా, క్రూడాయిల్ ద్రవ్యోల్బణ సూచీ 51.57 శాతానికి ఎగబాకింది. అంతక్రితం నెలలో ఇది కేవలం 1.29 శాతంగా మాత్రమే ఉన్నది. అలాగే తయారీ రంగ సూచీ 2.92 శాతం నుంచి 3.39 శాతానికి చేరుకున్నది. ఆగస్టు 2023 నుంచి టోకు ధరల సూచీ పెరుగుతూ వచ్చిందని, ప్రస్తుతం మూడేండ్ల గరిష్ఠ స్థాయిని తాకిందని బార్క్లెస్ తన రీసర్చ్ నోట్లో వెల్లడించింది.